Cannabis Cultivation: పత్తి పంటలో గంజాయి సాగు.. విత్తనాలెక్కడివి? సూత్రదారులెవరు?

author img

By

Published : Oct 13, 2021, 12:31 PM IST

గుప్పుమంటున్న గంజాయి సాగు.. సూత్రధారులెవరు?

ఇందూరులో జిల్లాలో గంజాయి సాగు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవల పోలీసులు, ఎక్సైజ్‌ శాఖల నిఘా విభాగాలు వరుసదాడుల్లో గంజాయిసాగు గుట్టు రట్టవుతోంది. మంగళవారం ఒకేరోజు సదాశి వనగర్‌, జుక్కల్‌ మండలాల్లోని పత్తి పంటలో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని అధికారులు గుర్తించి దహనం చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 15రోజుల వ్యవధిలోనే ఆరుచోట్ల గంజా యి సాగు మొక్కలు బయటపడ్డాయంటే స్మగ్లర్లు ఏ స్థాయిలో ఈ దందా సాగిస్తున్నారో తెలుస్తుంది.

నిజామాబాద్​ జిల్లా గాంధారి మండలం కాయితితండాలో ఈ నెల 3న ఆబ్కారీ పోలీసులు మొక్కజొన్న చేనులో గంజాయి మొక్కలు గుర్తించి తగలబెట్టారు. కొత్తబాదితండా శివారులో ఎకరం విస్తీర్ణంలో పంట వేయగా 4న దాడి చేసి ధ్వంసం చేశారు. జుక్కల్‌ మండలం వజ్రఖండి శివారులో అంతర పంటగా సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో 11న బిచ్కుంద సీఐ శోభన్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేసి కాల్చిచేశారు. బాన్సువాడ మండలం సోమ్లానాయక్‌తండాలో ఆగస్టులో మక్క చేనులో పంటను గుర్తించి నాశనం చేశారు.

మూడేళ్లుగా గంజాయి సాగు మరిచిన అక్రమార్కులు ఈ ఏడాది మళ్లీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తండాలు, సరిహద్దు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెంచుతున్నారు. ప్రధానంగా గాంధారి, జుక్కల్‌, పెద్దకొడపగల్‌, బాన్సువాడ ప్రాంతాల్లో ఈ దందా విస్తరిస్తోంది. అధికారులు కేవలం కేసుల నమోదు, పంట ధ్వంసంతోనే సరిపెడుతున్నారు. అసలు విత్తనాలెలా వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు. సూత్రధారులెవరు? పాత్రధారులెవరు?

ganjay
పొలాల్లో గంజాయి...

అనే కోణంలో దృష్టి పెడితేనే అడ్డుకట్ట పడుతుంది.

జుక్కల్‌ : ఆబ్కారీ శాఖ అధికారులు జుక్కల్‌ మండలం వజ్రఖండి శివారులో మంగళవారం 68 గంజాయి మొక్కలు పీకేసి రెవెన్యూ కార్యాలయానికి తెచ్చారు. బిచ్కుంద ఆబ్కారీ సీీఐ సుధాకర్‌, ఎస్సై అభిషేకర్‌, కానిస్టేబుళ్లు నవీన్‌రెడ్డి, స్వప్న, స్వరూప పాల్గొన్నారు.

మహారాష్ట్రలో డిమాండ్‌.. గంజాయి వాడకంలో మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. పొరుగు రాష్ట్రమే కావడం.. అక్కడ తీవ్ర డిమాండు నేపథ్యంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కొందరు మహా వ్యాపారులే విత్తనాలు సరఫరా చేస్తూ సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.

కొరవడిన నిఘా... గంజాయి కోసి రెండు మూడు రోజులు ఆరబెట్టిన తర్వాత ద్విచక్రవాహనాలు, జీపుల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గన్నీ సంచుల్లో నింపి బస్సులు, రైళ్లల్లో తీసుకెళ్తున్నట్లు సమాచారం.

అమాయకులే బలి.. పేదరికంలో మగ్గుతున్న గిరిజనులను మహా వ్యాపారులు డబ్బు ఆశ చూపెట్టి, అంతా తాము చూసుకుంటామని నమ్మిస్తూ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. గాంధారిలోని గిరిజన తండాల్లో ఈ ముఠా మకాం వేసి దందా కొనసాగిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నట్లు సమాచారం. రవాణాకు గిరిజన యువకులను వినియోగించుకుంటున్నారు. రెండు నెలల కిందట పెద్దకొడపగల్‌ మండలంలో మైనర్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటం గమనార్హం.

దాడులు చేస్తున్నాం

గంజాయి సాగుపై నిఘా పెట్టాం. గాంధారి, బాన్సువాడ, జుక్కల్‌లో దాడులు చేశాం. అటవీ ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తాం. గిరిజన రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సాగుకు దూరం చేస్తాం.

- శ్రీనివాస్‌, అధికారి, ఆబ్కారీశాఖ, కామారెడ్డి

యాచారంలో కాల్చివేత..

యాచారంలో ఆబ్కారీ అధికారులు రెండ్రోజుల కిందట గంజాయి మొక్కలు కాల్చివేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గంట్యాటతండాకు చెందిన ఓ వ్యక్తి పొలంలో 114 గంజాయి మొక్కలు వేశారు. నిజామాబాద్‌ అసిస్టెంటు ఎక్సైజ్‌ సూపరింటెంటెండు నందగోపాల్‌ ఆదేశాలకు మేరకు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ దీపిక పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Cyber crime: సైబర్‌ మోసాలకూ స్పెషల్ కోచింగ్‌ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.