B.pharm Student Death Case : బీఫార్మసీ విద్యార్థిని కేసులో నిందితుడు అరెస్ట్​

author img

By

Published : May 9, 2022, 11:47 AM IST

B.pharm Student Death Case

B.pharm Student Death Case : ఏపీలో బీఫార్మసీ విద్యార్థిని మృతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ రమాకాంత్‌ తెలిపారు.

B.pharm Student Death Case : : ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్లకుకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్​ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్​ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్​ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్​తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి... ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఏం జరిగిందంటే..: తిరుపతిలో బీ.ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్​కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగు చూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

B.pharm Student Death Case News : సమాచారం తెలుసుకున్న గోరంట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

B.pharm Student Death Case in AP : యువతి మృతిపై తెలుగుదేశం స్పందించింది. ఏపీ సీఎం జగన్ చేతకాని పాలనలో.. మహిళలపై ప్రతిరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించింది. బీఫార్మసీ విద్యార్థినిని హత్యాచారం చేసి.. ఆత్మహ‌త్యగా చిత్రీక‌రించ‌డం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మృత‌దేహాంతో పోలీస్‌స్టేష‌న్ ఎదుట ధ‌ర్నాకి దిగితేగానీ పోలీసులు స్పందించ‌క‌పోవ‌డం ఘోరమని మండిపడ్డారు. బంగారు భ‌విష్యత్తు ఉన్న అమ్మాయి అఘాయిత్యానికి బ‌లైతే, బాధిత‌కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని తాము కోర‌డం యాగీ చేయ‌డం కాదని ముఖ్యమంత్రికి చంద్రబాబు చురకలంటించారు.

ఆడ‌బిడ్డని కోల్పోయిన త‌ల్లి న్యాయం చేయాల‌ని పోలీస్‌స్టేష‌న్ ఎదుట వేడుకుంటున్నా.. కనికరించట్లేదని నారా లోకేశ్​ దుయ్యబట్టారు. వైకాపా మూడేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరగని రోజు లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లే రాష్ట్రంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. హత్యాచారం చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.