పాసుపుస్తకం జారీకి రూ.5 లక్షల డిమాండ్‌... అనిశాకు చిక్కిన తహసీల్దారు

author img

By

Published : Jul 23, 2021, 4:53 AM IST

Updated : Jul 23, 2021, 6:51 AM IST

అనిశాకు చిక్కిన తహసీల్దారు

రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్‌ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

అతనో దివ్యాంగుడైన రైతు. పట్టాదారు పాసు పుస్తకం కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడి మహిళా తహసీల్దారు కనికరించలేదు సరికదా.. భారీగా సొమ్ములు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులను ఆశ్రయించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దారు మేడిపల్లి సునీత గురువారం కొత్తపల్లికి చెందిన దివ్యాంగుడైన రైతు అయిత హరికృష్ణ వద్ద డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. కాటారం మండలం కొత్తపల్లి (సుందర్రాజ్‌పేట) శివారులోని సర్వే నంబరు-3లో హరికృష్ణకు 4.25 ఎకరాల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు అందులో తమకూ వాటా ఉందనడంతో వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాలవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాత వారు రాజీకి వచ్చారు.

మొత్తం భూమిలో హరికృష్ణ 2.25 ఎకరాలు, మరో వర్గం 2 ఎకరాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తన భూమికి పాసు పుస్తకం మంజూరు చేయాలంటూ జూన్‌ మొదటి వారంలో తహసీల్దారుకు హరికృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి వివాదంలో ఉందని, రూ.5 లక్షలు ఇస్తేనే పుస్తకం మంజూరు చేస్తానని తహసీల్దారు చెప్పగా.. అప్పటికప్పుడు రూ.50 వేలు చెల్లించారు. మరో రూ.3 లక్షలు ఇస్తేనే పని అవుతుందని తహసీల్దారు చెప్పడంతో.. తన పరిస్థితిని హరికృష్ణ తన బావమరిదికి వివరించారు. ఈ నెల 12న వారిద్దరూ అనిశా అధికారులను సంప్రదించారు. గురువారం ఆమె కార్యాలయంలోనే హరికృష్ణ రూ.2 లక్షల నగదు ఇస్తుండగా.. అధికారులు తహసీల్దారు సునీతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

'కొత్తపల్లి శివారులోని సర్వే నెంబర్​ 3లో నాకు 4.25 గుంటల భూమి ఉంది. ఈ భూమికి కొత్త పాసు పుస్తకాల కోసం అడిగితే సంతకం పెట్టేందుకు ఎమ్మార్వో రూ.5 లక్షలు అడిగారు. రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో రూ.50 వేలు ఇచ్చాం. తర్వాత నాకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఈరోజు రూ.2 లక్షలు ఇస్తుండగా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.'

-హరికృష్ణ, బాధిత రైతు

ఇదీ చూడండి: గుజరాత్ యువతుల వసూళ్ల దందా.. వాహనదారులను ఆపి మరీ దబాయింపు..!

Last Updated :Jul 23, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.