series of thefts: ఖమ్మం, కొత్తగూడెంలో రెచ్చిపోతున్న దొంగలు

author img

By

Published : Aug 26, 2021, 4:06 AM IST

thefts

ఖమ్మం, కొత్తగూడెంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, శివారుకాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలే లక్ష్యంగా విచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేని వీధులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి.

ఖమ్మం, కొత్తగూడెంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా ప్రభావంతో ఇళ్లకు తాళం వేసుకుని జనం గ్రామాలకు వెళ్లడంతో చోరీలు మరింత పెరిగాయి. ఖమ్మంలోని టీఎన్జీవో కాలనీ, సాయికృష్ణ నగర్‌, కరుణగిరి, సాయిగణేశ్‌ నగర్‌, సాయినగర్‌, మారుతీనగర్‌ కాలనీల్లో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. శ్రీరాంనగర్, ముస్తఫానగర్, శ్రీనగర్ కాలనీల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 చోరీలు జరిగినట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల సారథినగర్‌లోని ఓ ఇంట్లో సుమారు రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి అపహరించుకుపోయారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు చేధన పోలీసులకు కష్టతరంగా మారింది. కొత్తగూడెంలోని బస్టాండ్ ప్రాంతం, ఎంజీ రోడ్డులోని వ్యాపార సముదాయాలు, రామవరం కాలనీ, మేదర బస్తీ, బూడిద గడ్డ, గణేశ్ టెంపుల్, రైటర్ బస్తీ ప్రాంతాల్లో తరచూ చోరీలు జరుగుతున్నాయి.

పని చేయని సీసీ కెమెరాలు

ఖమ్మంలో నాలుగు, కొత్తగూడెంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్స్ బృందాలు అందుబాటులో ఉన్నా చోరీలకు అడ్డుకట్టపడట్లేదు. ఖమ్మం, కొత్తగూడెంలో గతంలో సీసీ కెమెరాలు ఉన్నా శివారు కాలనీలు, కొత్త ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. ఖమ్మంలో సుమారు 200 వరకు సీసీ కెమెరాలు ఉన్నా సగానికి పైగా పనిచేయట్లేదు. కొత్తగూడెంలోనూ అదే పరిస్థతి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. రెండు జిల్లాల ఉన్నతాధికారులు దృష్టిసారిస్తేనే చోరీలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: crime: తమ బంధాన్ని ప్రేయసి భర్తకు చెప్పేశాడని.. స్నేహితుడిని ఏంచేశాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.