న్యాయవాది దారుణ హత్య.. ఆ వివాదాలే కారణమా..!

author img

By

Published : Aug 2, 2022, 8:18 AM IST

Murder

Lawyer Murder in Mulugu : ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ సమస్యపై కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్న హనుమకొండకు చెందిన న్యాయవాదిని దారుణంగా హత్య చేశారు. కారులో వెంబడించిన దుండగులు.. కత్తులతో పొడిచి చంపారు. ఘటనా స్థలికి చేరుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Lawyer Murder in Mulugu : హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు. భూ సమస్యపై ములుగు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి సోమవారం సాయంత్రం 6.30 సమయంలో తిరిగి హనుమకొండకు వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కారు డ్రైవర్‌ సారంగం, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం పందికుంట బస్‌ స్టేజీ సమీపంలో స్పీడు బ్రేకర్ల వద్ద మల్లారెడ్డి వాహనాన్ని వెనుక మరో కారులో వస్తున్న నిందితులు ఢీకొట్టారు. న్యాయవాది వాహనం దిగి ఎందుకు ఢీ కొట్టారని అడగగా.. అందులో ఒక వ్యక్తి వచ్చి క్షమించాలని కోరాడు.

దీంతో సరేనని న్యాయవాది తన కారు ఎక్కి డోరు వేసుకుంటుండగా మరో నలుగురు వచ్చారు. వారిలో ముగ్గురు వ్యక్తులు న్యాయవాదిని కారులో నుంచి కిందకు లాగి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. అక్కడే ఉన్న డ్రైవర్‌ను మరో ఇద్దరు వ్యక్తులు కదలకుండా పట్టుకున్నారు. అనంతరం అయిదుగురు నిందితులూ అదే కారులో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌, ఏఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు సోమవారం రాత్రి వెల్లడించారు.

భూసమస్యల విషయమై మల్లారెడ్డి ఇటీవల తరచూ ములుగు కలెక్టర్‌, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మల్లారెడ్డి కదలికలను శత్రువులు పసిగట్టి వెంబడిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డికి ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములతో పాటు ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు వ్యాపారాలున్నాయి. ఆయా భూములకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని సమాచారం. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్వస్థలం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాగా.. చాలా ఏళ్లుగా హనుమకొండలో నివాసం ఉంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.