చిన్నారికి ప్రాణహాని.. పొలం ఇవ్వాలని బెదిరింపులు..

author img

By

Published : Sep 20, 2021, 4:52 PM IST

threaten to a girl

ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది ఆ చిన్నారి. నాయనమ్మ సంరక్షణలో పెరిగింది. అక్క తోడుగా ఉందనే భరోసాతో ఉంది. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె కూడా చనిపోయింది. ఆ చిన్నారికి వారసత్వంగా వచ్చిన రెండెకరాల పొలం మాత్రమే మిగిలింది. అది తన మనుమరాలి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంది తన నాయనమ్మ. కానీ ఇంతలోనే అనాథలా మారిన ఆ పాప ఆస్తిపై రాబందులు కన్నేశాయి. ఆ పొలం ఆక్రమించుకోవాలని చూసి.. ఆ బాలికను చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు కొందరు. జోగులాంబ జిల్లా ఉట్కూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన ఓ చిన్నారి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తమ గ్రామానికే చెందిన లక్ష్మన్న, బీసన్న.. పొలం కాజేసేందుకు తనను చంపాలని చూస్తున్నారని సుహానా బేగం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సుహానా బేగం.. బుక్కాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఏడేళ్ల క్రితమే తను తల్లిదండ్రులను అనారోగ్యంతో మరణించారు. సోదరి ఆస్మాతో కలిసి నాయనమ్మతో ఉంటోంది. గతేడాది అక్క ఆస్మా అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మరణానంతరం బాలిక పేరుతో ఉన్న రెండెకరాల పొలం కొట్టేసేందుకు లక్ష్మన్న, బీసన్న అనే ఇద్దరు ప్రయత్నిస్తున్నారని సుహానా తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కూడా చంపేసి పొలం లాక్కునేందుకు లక్ష్మన్న చూస్తున్నాడని చిన్నారి వాపోయింది. బుక్కాపురంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా చంపుతామని బెదిరిస్తున్నారని చిన్నారి నాయనమ్మ, బంధువులు ఆరోపించారు.

మా నాన్న చనిపోవడంతో ఆయన పేరు మీద ఉన్న పొలం నాకు వారసత్వంగా వచ్చింది. ఈ భూమిని లాక్కునేందుకు మా ఊళ్లోనే ఉండే లక్ష్మన్న, బీసన్న యత్నిస్తున్నారు. నన్ను చంపాలని కూడా ప్రయత్నించారు. వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. నాకు రక్షణ కల్పించాలి. -సుహానా బేగం, బాధిత చిన్నారి

తల్లిదండ్రులు చనిపోవడంతో సుహానా మా దగ్గరే ఉంటోంది. తన పేరు మీద ఉన్న ఆస్తిని ఇద్దరు కాజేయాలని చూస్తున్నారు. దారి కాచి పాపను చంపుతామని బెదిరిస్తున్నారు. చిన్నారిని చూసుకుంటున్నందుకు మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. పోలీసుల ఎదురుగానే మమ్మల్ని బెదిరిస్తున్నారు. -చిన్నారి బంధువులు

తనకు రక్షణ కల్పించి తమ పొలాన్ని తమకు ఉండేటట్లు చూడాలని సుహానా.. పోలీసులను విజ్ఞప్తి చేసింది. చిన్నారి ఫిర్యాదుపై విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు. సాక్ష్యాధారాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

మీడియాతో చిన్నారి ఆవేదన

ఇదీ చదవండి: KTR AND REVANTH TWITTER WAR: టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు టు వైట్​ ఛాలెంజ్​ వయా ట్విటర్​ వార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.