పండుగ పూట విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు మృతి

author img

By

Published : Oct 6, 2021, 5:02 PM IST

Updated : Oct 6, 2021, 7:38 PM IST

2 children  died due to fall in check dam at sangareddy district

17:01 October 06

చెక్‌డ్యాంలో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతి

సెలవులను ఆస్వాధించాలన్న సరదా.. ఆ చిన్నారులను బలితీసుకుంది. పండుగ పూట ఆ ఇళ్లలో తీరని విషాదం నిండింది. ఈత కొట్టేందుకని వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా బయటికి వచ్చారు. గ్రామ శివారులో ఉన్న చెక్‌డ్యాంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

సంగారెడ్డి జిల్లా మెుగుడంపల్లి మండలం సర్జారావుపేట తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.  దసరా సెలవులు ప్రకటించటంతో.. తొమ్మిదేళ్ల శ్రీనాథ్, పదకొండేళ్ల అరవింద్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా పంట పొలాల వైపు వెళ్లారు. చెక్​డ్యామ్​లో ఈత కొట్టాలని ఆరాటపడ్డారు. డ్యాంలోకి దిగిన శ్రీనాథ్, అరవింద్.. ప్రమాదవశాత్తు మునిగిపోయారు.

మిగతా చిన్నారులకు ఏం చేయాలో తోచక.. భయంతో తండా వైపు పరుగులు తీశారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన డ్యాం వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు నీటిలో గాలింపు చేపట్టారు. ఇద్దరు చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు.

అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా చెంగుచెంగునా ఆడుకున్న పిల్లలు.. విగతజీవాలుగా పడి ఉండటాన్ని చూసి వాళ్ల తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు ఆస్పత్రిని చేరుకుని.. చిన్నారుల మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఇదీ చూడండి:

Last Updated :Oct 6, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.