సీఎం సొంత జిల్లాలో దారుణం.. బాలికపై 10 మంది అత్యాచారం!

author img

By

Published : May 12, 2022, 8:36 AM IST

RAPE ON MINOR GIRL

RAPE ON MINOR GIRL: ఏపీలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా మార్పు రావడం లేదు. తాజాగా వైఎస్ఆర్​ జిల్లాలో బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

RAPE ON MINOR GIRL: ఏపీ సీఎం జగన్‌ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనరు బాలిక ఆశ్రయం పొందుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయారు. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్‌ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా... ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని వారు సమాధానమిచ్చారని పేర్కొంది. ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్‌ మల్లీశ్వరి వీడియో తీశారు. అనంతరం పట్టణంలోని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సీఐ ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులూ కేసు నమోదు చేయకుండా... ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతోంది.

విచారణ చేపట్టాం..

బాలికపై అత్యాచార ఘటన మా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించం. త్వరలోనే కొలిక్కి వస్తుంది. - ప్రసాదరావు, డీఎస్పీ, ప్రొద్దుటూరు, వైయస్‌ఆర్‌ జిల్లా

ఇదీ చదవండి:RAPE ATTEMPT: 11 ఏళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.