Crop losses: వేల ఎకరాల్లో మునిగిన పైర్లు.. పెట్టుబడి రాయితీ కోల్పోతున్న రైతులు!

author img

By

Published : Sep 8, 2021, 9:39 AM IST

Crop losses in telangana

రాష్ట్రంలో జోరువానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. పలు జిల్లాల్లో కోత దశకు చేరిన పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. ఇంత నష్టం జరుగుతున్న వ్యవసాయాధికారులు పంట నష్టాలను అధికారికంగా గుర్తించడం లేదు. ఫలితంగా రైతులు... పెట్టుబడి రాయితీకి కోల్పోతున్నామని వాపోతున్నారు.

.

వర్షాలు పంటలపై పంజా విసిరాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో వేల ఎకరాల్లో పంటలు మునిగి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా వ్యవసాయాధికారులు ఎక్కడా పంట నష్టాలను అధికారికంగా గుర్తించడం లేదు. దీంతో తాము పెట్టుబడి రాయితీని కోల్పోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో కోత దశకు చేరిన పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలు నేలపాలయ్యాయి. పూత కాత దశలో ఉన్న పత్తిచేలలో 2 నుంచి 3 అడుగుల ఎత్తున నీరు నిలిచి చెట్లు కుళ్లిపోతున్నాయి. వరి నాట్లూ నీటమునిగాయి. చెరువులు, వాగులు పొంగి పొలాల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో ఇసుక, మట్టి మేటలు వేశాయి. పంట నష్టాలను ఫొటోలు తీసి అధికారులకు వాట్సాప్‌ ద్వారా పంపిస్తున్నా వారి నుంచి స్పందన ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. పంటల నష్టం వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శి, కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావును ‘ఈనాడు - ఈటీవీ భారత్​’ అడిగితే సమాధానం ఇవ్వలేదు. వర్షాలతో, వరదలతో 50 శాతానికి పైగా పంట నష్టపోతేనే వివరాలు పంపాలని మౌఖిక ఆదేశాలున్నందున సమగ్రంగా సేకరించడంలేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు - ఈటీవీ భారత్​’తో చెప్పారు.

33 శాతం దెబ్బతింటే పెట్టుబడి రాయితీ!

.

విపత్తులతో ఎకరా పైరులో 33 శాతం దెబ్బతింటే పెట్టుబడి రాయితీ కింద రైతుకు తక్షణ సాయం అందజేయాలని కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. అంత నష్టం ఉంటే ఎకరానికి పంటను బట్టి రూ.10 వేల వరకూ ఇస్తారు. ఈ సొమ్ము రావాలంటే రాష్ట్ర వ్యవసాయశాఖ సమగ్ర వివరాలను కేంద్రానికి పంపాలి. అనంతరం కేంద్ర బృందం తనిఖీ చేసి నిధులు విడుదల చేస్తుంది. కానీ రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో వివరాలే సేకరించకపోవడంతో కేంద్రానికి గత మూడేళ్లుగా నష్టాల వివరాలు పంపడం లేదని ఓ అధికారి చెప్పారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పూర్తిగా నిలిపివేయడంతో బీమా పరిహారం వచ్చే అవకాశం కూడా లేదు.

కళ్ల ముందు నష్టాలు కనపడుతున్నా..

.

సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ వరంగల్‌, జయశంకర్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లోని 21 గ్రామాల్లో 20 నుంచి 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎక్కడైనా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే వరదలొచ్చి పంటలు దెబ్బతింటాయని, లోతట్టు ప్రాంతాలు మునుగుతాయని వాతావరణశాఖ తెలిపింది. అయినా పంటనష్టాలేవీ లేవని వ్యవసాయశాఖ చెబుతుండటం, వర్షాలు ఆగి నీరు వెళ్లిపోతే పంటలన్నీ బాగుంటాయని సమాధానమిస్తుండడం గమనార్హం.

రైతులే సోషల్‌ మీడియాలో పెడుతున్నా..

.

గతంలో విపత్తులతో పంటలు దెబ్బతింటే నష్టాలను చూడాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను రైతులు ప్రాధేయపడేవారు. ప్రస్తుతం దెబ్బతిన్న పైర్ల ఫొటోలను తీసి వాట్సాప్‌లో అధికారులకు రైతులే పంపుతున్నారు. నష్టాలేమీ లేవని చెబుతున్న వ్యవసాయాధికారులకు ఈ ఫొటోలు చూపితే సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారని ఓ రైతు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు వివరించారు. పంటల వారీగా పలువురు రైతులు వాట్సాప్‌లో గ్రూపులు నిర్వహిస్తున్నారు. పంట నష్టాల ఫొటోలను అందులో పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పసుపు వ్యాపారులు, రైతులు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌, నాందేడ్‌ జిల్లాలకు చెందిన అనేక మంది రైతులు తమ పంట నష్టాల ఫొటోలను ఇందులో పెడుతూ ఎంత దిగుబడి తగ్గవచ్చనే అంచనాలు కూడా వేస్తున్నారు. కానీ వ్యవసాయ, ఉద్యాన అధికారులను అడిగితే నష్టాలేం లేవని దాటవేస్తుండటం గమనార్హం.

ఇదీచూడండి: RAINS IN TELANGANA: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఉత్తర తెలంగాణలో కుండపోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.