గృహనిర్బంధంలో బండి సంజయ్‌, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

author img

By

Published : Aug 23, 2022, 10:29 AM IST

Updated : Aug 23, 2022, 5:17 PM IST

bandi sanjay arrest

10:26 August 23

బండి సంజయ్ అరెస్టును ఖండించిన భాజపా నేతలు

జనగామలో బండి సంజయ్‌ అరెస్టు, ఖండించిన భాజపా ఎమ్మెల్యేలు

Bandi Sanjay Arrest: నిన్న హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి చేపట్టిన భాజపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేయడాన్ని నిరసిస్తూ బండి సంజయ్ ధర్మదీక్ష చేయాలని నిర్ణయించారు. అడ్డుకున్న పోలీసులు... జనగామ జిల్లా పామ్నూర్ శిబిరం వద్ద సంజయ్‌ను అరెస్టుచేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాజపా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో... కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ శ్రేణుల తోపులాటల నడుమే సంజయ్ ను అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. అనంతరం కరీంనగర్‌లో తన నివాసం వద్ద పోలీసులు బండి సంజయ్‌ను వదిలిపెట్టారు. రేపటి వరకు బండి సంజయ్‌ను గృహనిర్భందంలోనే ఉంచనున్నారు.

పోలీసులు అరెస్టును బండి సంజయ్ ఖండించారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. తెరాస వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ఎండ గడుతూనే ఉంటామని తెలిపారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చని సంజయ్ విమర్శించారు. పాద యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న తెరాసపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలు బయట పెడుతున్నందుకే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందనే అభద్రతాభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టులు చేయిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో 'చే' నెంబర్ ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అరెస్టును ఖండిస్తున్నట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ తెలిపారు.

కేసీఆర్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకుండా బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారారని ఆమె ఆరోపించారు. సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ధర్మపురి అర్వింద్‌ చెప్పారు. కారణం చెప్పకుండా అరెస్ట్‌ చేశారన్నారు. భాజపా నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. అరెస్ట్‌లు, కేసులతో భాజపా కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేసులు, అరెస్ట్‌లతో భాజపాని అడ్డుకోలేరని ఈటల రాజేందర్‌ అన్నారు. బండి సంజయ్‌, రాజాసింగ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే.. కేసులు పెడతారా అని రఘునందన్ ప్రశ్నించారు. మూడుసార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలపై తెరాస నేతల దాడి ఘటనపై ఫిర్యాదు చేశామని.. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ భాజపా నిరసనలకు పిలుపునిచ్చింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు వరకు పార్టీ మండల కార్యాలయ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నారు.

Last Updated :Aug 23, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.