ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

author img

By

Published : Aug 27, 2022, 12:51 PM IST

Updated : Aug 27, 2022, 3:19 PM IST

ముగిసిన బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay Padayatra ended in Warangal భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. చివరి రోజు 14 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది.

Bandi Sanjay Padayatra ended in Warangal: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. 11 నియోజక వర్గాలు, 5 జిల్లాల్లో 300 కిలోమీటర్ల పాటు సంజయ్‌ యాత్ర చేశారు. ఆగస్టు 2న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. వరంగల్​ భద్రకాళీ అమ్మవారి ఆలయం వరకు 21 రోజులు కొనసాగింది. మూడు విడతలు కలిపి మొత్తం 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,121 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో చివరి రోజు యాత్ర వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. బండి సంజయ్​కు స్వాగతం పలికేందుకు యువత, భాజపా శ్రేణులు భారీగా తరలి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో బండి పాదయాత్ర కోలాహలంగా యాత్ర సాగింది.

వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు మీదుగా 14 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. జనం భారీగా పాల్గొనటం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వన్​వే చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్​ను యథాతథం చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

మరోవైపు వరంగల్‌కు వెళ్లే రహదారులు మొత్తం కాషాయమయమయ్యాయి. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు విచ్చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బండి సంజయ్​కు శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు.. పోటాపోటీగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

Last Updated :Aug 27, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.