తెలంగాణకు దక్కాల్సిన కృష్ణానది జలాల్లో వాటా ఎందుకు తగ్గింది!

author img

By

Published : Apr 21, 2022, 3:23 AM IST

Prahlad Singh Patel

Prahlad Singh Patel: కృష్ణానది నికర జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన దాని కన్నా నీటి వాటా తగ్గడానికి కారకులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ అన్నారు. దేశంలో నదుల అనుసంధానంపై చర్చలు కొనసాగుతుంటే... తెలంగాణ మాత్రం గోదావరి నీటిపై పట్టుపడుతోందని పేర్కొన్నారు. నిజాం కాలంలో రజాకార్లు వస్తే మానప్రాణాలు పోతాయని బిక్కు బిక్కుమని బతికే వాళ్లు.. మనం నిజాం పాలనను చూడలేదు.. కానీ ఆనాటి పాలనను కేసీఆర్‌ చూపిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Prahlad Singh Patel: కృష్ణానది నికర జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన దాని కన్నా నీటి వాటా తగ్గడానికి కారకులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ అన్నారు. 811 టీఎంసీల నుంచి 299 టీఎంసీలు చాలని ఒప్పందంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దాని ఫలితంగానే న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన 512 టీఎంసీల నీటి వాటాను కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలంలో కొనసాగింది. అమరవాయి వద్ద ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ జలాల పంపకం కోసం మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోర్టులో కేసులు వేసిందని, కోర్టులో కేసు నడుస్తుండగా ట్రైబ్యునల్‌ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడంతో ఏడు సంవత్సరాల అనంతరం కేసును వాపసు తీసుకున్నారన్నారు.

ప్రస్తుతం ట్రైబ్యునల్‌ అంశం కేంద్ర పరిధిలో ఉందన్నారు. దేశంలో నదుల అనుసంధానంపై చర్చలు కొనసాగుతుంటే... తెలంగాణ మాత్రం గోదావరి నీటిపై పట్టుపడుతోందన్నారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం రావొచ్చు కానీ, కృష్ణా నదిలోకి ఎందుకు రాకూడదో చెప్పాలన్నారు. ప్రస్తుతం ట్రైబ్యునల్‌ లేదని, మరి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఎవరు ఇచ్చారని..ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించి అన్ని అనుమతులు తీసుకుని నిర్మించాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. కానీ ఆర్డీఎస్‌తో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదన్నారు. ఆర్డీఎస్‌ హెడ్‌ వర్క్స్‌ వద్ద తూములు, తెలంగాణ పరిధిలోని కాలువల ఆధునికీకరణపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు పూర్తి చేశామన్నారు. కర్ణాటకను ఇందులో భాగస్వామిని చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో దాష్టీకాలపై చర్యలు తీసుకోండి: ‘నిజాం కాలంలో రజాకార్లు వస్తే మానప్రాణాలు పోతాయని బిక్కు బిక్కుమని బతికే వాళ్లు..మనం నిజాం పాలనను చూడలేదు.. కానీ ఆనాటి పాలనను కేసీఆర్‌ చూపిస్తున్నారు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ముఖానికి నల్ల మాస్క్‌ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఎక్కడ హత్య.. అత్యాచారాలు జరిగినా దానికి కారకులు తెరాస వాళ్లే అవుతున్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం ఇప్పటి వరకు బాధ్యులైన ఒక్క నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ దారుణాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయిగణేష్‌ మరణానికి కారకులైన స్థానిక మంత్రి, తెరాస నాయకులు, పోలీసులకు కఠిన శిక్ష పడేదాకా ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని అన్నారు. డీకే అరుణ మాట్లాడారు.

ఇదీ చదవండి:సాయిగణేశ్ కుటుంబసభ్యులను పరామర్శించిన కేెంద్ర సహాయమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.