అధికారుల నిర్లక్ష్యం, నిరుపయోగంగా లక్షలు పెట్టికొన్న యంత్రాలు, పరికరాలు

author img

By

Published : Aug 21, 2022, 12:10 PM IST

Negligence of authorities

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పురపాలిక అవసరాల కోసం, లక్షలు పోసి వెచ్చిస్తున్న యంత్రాలు, పరికరాలు, వాహనాలు అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా ఏళ్లుగా వృథాగా పడి ఉంటున్నాయి. లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు, యంత్రాలు కొద్ది రోజుల్లోనే ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం ఉండటం లేదు.

అధికారుల నిర్లక్ష్యం, నిరుపయోగంగా లక్షలు పెట్టికొన్న యంత్రాలు, పరికరాలు

మున్సిపాలిటీ అవసరాల కోసం లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న యంత్రాలు, వాహనాలు, పరికరాలు... ఆస్తుల్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పురపాలికలో పాతనాగుల బావి స్థలంలో 60లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఫుడ్ వెండింగ్ జోన్... మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఒక్కోటి రెండున్నర లక్షల చొప్పున 10 ఫుడ్ వెండింగ్ కార్ట్స్​ను... 25లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.

మిగిలిన డబ్బుతో అక్కడున్న బావిని పూడ్చి.. చదువు చేసి, ఫెన్సింగ్ వేశారు. వినియోగదారుల కోసం బెంచీలూ ఏర్పాటు చేశారు. జూన్ మాసంలో దీన్ని ప్రారంభించారు. ఆహారం అమ్మే వీధివ్యాపారుంతా రోడ్లమీద కాకుండా అక్కడే వాటిని అమ్ముకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. కానీ ఒకటి రెండు రోజులు అమ్మిన వీధివ్యాపారులు తిరిగి రోడ్లమీదకు వచ్చేశారు. ప్రస్తుతం ఫుడ్ వెండింగ్ జోన్ అలంకార ప్రాయంగా మిగిలింది. ఆ ప్రాంతంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గిరాకీ రాకపోవడంతో చిరువ్యాపారులు అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు.

మహబూబ్ నగర్ పురపాలికలో పెద్దచెరువులోకి చెత్తాచెదారం పోకుండా నీళ్లు మాత్రమే వెళ్లేలా... వేపూరిగేరి వాగులో 8లక్షలతో స్వయం నియంత్రిత యంత్రాన్ని ఏర్పాటు చేశారు. బిగించిన కొద్దిరోజులు పనిచేసిన ఆ యంత్రం ప్రస్తుతం పనికిరాకుండా పడిఉంది. యంత్రంలోని కొన్ని భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన సంస్థ చేతులెత్తేసింది. మక్తల్ మున్సిపాలిటీలో 2020లో కొనుగోలు చేసిన చెత్తసేకరించే 4 ఎలక్ట్రికల్ ఆటోలు వృథాగా పడి ఉన్నాయి. మొదటి నెలరోజులు బాగానే వినియోగించారు. మక్తల్ పట్టణ రహదారులు అవి నడిచేందుకు వీలుగా లేకపోవడం, చెత్తను తరలిస్తున్నప్పుడు పలుమార్లు బోల్తాపడటంతో వాటిని పక్కన పెట్టేశారు. ఒక్కో ఆటో విలువ లక్షా 80వేల రూపాయలు. మురికి కాల్వలను శుభ్రం చేసే యంత్రాన్నీ 6లక్షలతో అప్పుడే కొనుగోలు చేశారు. కానీ మక్తల్ మురికి కాల్వల పరిమాణానికి అనుకూలంగా లేకపోవడంతో ఆ యంత్రమూ మూలన పడింది.

వనపర్తి పురపాలికలో 64లక్షలతో కొనుగోలు చేసిన రోడ్లూడిచే యంత్రవాహనం 3నెలలుగా పక్కన పడింది. మరమ్మత్తులకు గురికావడంతో అధికారులు దాన్ని పక్కన పడేశారు. బాగు చేసేందుకు కావాల్సిన పరికరాలు స్థానికంగా దొరక్కపోవడంతో... యంత్రాన్ని పంపిణీ చేసిన ఏజెన్సీకి ఆర్డర్ పెట్టారు. అవి రాగానే తిరిగి వినియోగంలోకి తెస్తామని.. మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహరెడ్డి తెలిపారు. చిన్నమరమ్మత్తులతో తిరిగి వినియోగించుకునే అవకాశం ఉన్నా... అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పురపాలికల్లో చెత్త సేకరించే ఆటోలు, మురికి కాల్వలు శుభ్రం చేసే యంత్రాలు, ఫాగింగ్ మిషన్లు మూలన పడేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.