KTR Help: 'రిజ్వానా' కేటీఆర్​ను కదిలించింది? ఎవరీ రిజ్వానా? కేటీఆర్ ఏం చేశారంటే?

author img

By

Published : Nov 10, 2021, 10:56 PM IST

minister ktr responded on mahaboobnagar married women problems

కష్టంలో ఉన్న వారికి తనకు చేతనైన సాయం చేస్తూ.. మంత్రి కేటీఆర్​ తన మానవత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఓ గృహిణికి ఉన్న ఇబ్బందులు, తాను పడుతున్న కష్టాలు, అవి తీర్చుకునేందుకు ఆమె చేసుకుంటున్న విజ్ఞప్తి.. మంత్రి దృష్టికి రాగానే స్పందించారు. ఎన్నో ఏళ్లుగా ఆ మహిళ, ఆమె కుటుంబం పడుతున్న కష్టాలు తీర్చేలా అధికారులను పురామాయించారు. అసలు ఆమె కథేంటీ..? కేటీఆర్​ ఏం చేశారంటే..?

చిన్నవయసులోనే పెళ్లి. ఆ తర్వాత నలుగురు సంతానం. అందులో ఇద్దరు మానసిక దివ్యాంగులు. భర్తకు వచ్చే సంపాదన పొట్టకు, బట్టకే ఇబ్బందిగా మారింది. ఇన్ని కష్టాల్లోనూ.. పెళ్లికి ముందు తాను చదివిన ఇంటర్​కు తోడు.. డిగ్రీ పూర్తి చేసింది. తమ కష్టాలు తీర్చుకునేందుకు చిన్నపాటి ఉద్యోగం ఏదైనా చూపించాలని పెద్దలను వేడుకుంది. ఈ మహిళ న్యాయమైన విజ్ఞప్తి.. నేరుగా మంత్రి కేటీఆర్​కు చేరింది.

చదవాలని ఉన్నా చదవలేక..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం వీరన్నపేటకు చెందిన రిజ్వానా కథ ఇది. ఇంటర్‌ వరకు చదివిన రిజ్వానాకు తల్లిదండ్రులు 2009లో నాగర్‌కర్నూల్​కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. రెండే ళ్లపాటు అక్కడ జీవనం సాగించిన ఆమె మెట్టినింట్లో పోరు భరించలేక భర్తను తీసుకొని పుట్టినింటికి వచ్చారు. భర్త మెకానిక్‌ పని చేస్తూ తెచ్చే అరకొర సంపాదనతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. చదువుకుంటేనైనా.. తన తలరాత మారుతుందేమోనని రిజ్వానా తల్లే ఖర్చులు భరిస్తూ.. డిగ్రీ వరకు చదివించింది. 2016లో బీఏ (ఈపీపీ) పూర్తిచేసిన రిజ్వానాకు బీఈడీలో సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదవలేకపోయింది. భర్త సంపాదన ఏమాత్రం చాలడం లేదని షాసాబ్‌గుట్టలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కూడలిలో మిర్చీబండి పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకొంటున్నారు.

కనపడ్డ వాళ్లందరికీ విజ్ఞప్తి..

కరోనాతో పనుల్లేక భర్త కూడా మిర్చీ బండి దగ్గర రిజ్వనాకు సహకారం అందిస్తున్నారు. నలుగురు పిల్లల్లో రెండో సంతానం రేహాన్‌ హుసేన్‌ (10), మూడో సంతానం జైనబ్‌ బేగం(9) మానసిక వైకల్యంతో పుట్టడంతో వారి ఆలనపాలన, వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లల్లో కుమారుడికి మాత్రమే దివ్యాంగ పింఛను వస్తోంది. కుమార్తెకు కూడా అధికారులు పింఛను ఇప్పించాలని, డిగ్రీ చదివిన తనకు ఏదైనా ప్రభుత్వ శాఖలో పొరుగు సేవలు లేదా ఒప్పంద పద్ధతిన ఉద్యోగం ఇస్తే దివ్యాంగులైన పిల్లలను పోషించుకుంటానని తెలిసిన పెద్దవాళ్లందరినీ కోరుకునేది. మానసిక వికలాంగులైన తనపిల్లలకు భవిత కేంద్రాల్లో బోధన అందించడానికి అధికారులు చొరవ చూపాలని కోరుకునేది.

వెంటనే స్పందించిన కేటీఆర్​..

రిజ్వానా గోడు ఈనాడు దినపత్రికలో చదివిన ఓ పాఠకుడు.. ఆ కథనాన్ని మంత్రి కేటీఆర్​కు ట్వీట్​ చేశారు. ట్విట్టర్‌ ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్‌.. వెంటనే స్పందించారు. రిజ్వానా పిల్లలకు విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని... రెండు పడక గదుల ఇల్లును కేటాయించాలని.. ట్విట్టర్ ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సంబంధిత కుటుంబసభ్యుల స్థితిగతులను తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహశీల్దారు పార్థసారథి, ఇంఛార్జ్​ డీఈవో, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ నటరాజ్‌, ఐసీడీఎస్‌, అంగన్‌వాడీ అదికారులు కుటుంబాన్ని పరామర్శించారు. రిజ్వానా కుటుంబం ఆర్థిక పరిస్థితి, కావాల్సిన సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని వివరించారు. తక్షణ సాయం కింద నిత్యావసర వస్తువులను అందజేశారు.

మానసిక దివ్యాంగులైన చిన్నారులతో తల్లిడిల్లుతోన్న వైనంపై ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ స్పందించడం పట్ల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు బాధలు గట్టు ఎక్కుతాయోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.