Corrupt Officers: దుకాణానికో రేటు.. దస్త్రానికో ధర.. వ్యవసాయ అధికారుల ముడుపుల భాగోతం

author img

By

Published : Aug 30, 2021, 7:31 AM IST

Corrupt agriculture Officers in Khammam district

ఆయనో మండల వ్యవసాయ శాఖ అధికారి. రైతులకు అవసరమైన సూచనలు, మెళకువలు నేర్పి.. సాగుకు దన్నుగా ఉండాల్సిన ప్రతినిధి. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించేందుకు దుకాణాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత అతడిదే. కంచే చేను మేసిన చందంగా వ్యవహించారు సదరు అధికారి. దుకాణాల నుంచి ఠంచనుగా అందుతున్న మామూళ్ల మత్తులో రైతు ప్రయోజనాలు మరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన అధికారి బాగోతం.. ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన ఒక్కరే కాదు.. వసూల్ రాజాలు వ్యవసాయశాఖలో కోకొల్లలుగా ఉన్నారన్నదే ఇప్పుడు వినిపిస్తున్న వాదన.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొంతమంది అధికారుల తీరుతో... వ్యవసాయ శాఖ పరువు బజారున పడుతోంది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ ప్రధానమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు జోరుగానే సాగుతున్నాయి. జిల్లాలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఖమ్మం జిల్లాలో మొత్తం 220, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 389 ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. మండల కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలు, ఖమ్మం నగరంలో ఏళ్ల నాటి నుంచి ఈ వ్యాపారం జోరుగానే సాగుతోంది.

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న దుకాణాలకు జిల్లావాసులే కాకుండా... సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాల నుంచి రైతులు ప్రతీ సీజన్​లోనూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ సీజన్​లో ఒక్క ఖమ్మం నగరంలోనే కోట్లలో వ్యాపారం సాగుతుంది. ఇవేకాకుండా మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ ఈ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుకాణాల యజమానులు వ్యవసాయ శాఖ అధికారులకు గుడ్​విల్ కింద ఏటా ఎంతో కొంత డబ్బు ముట్ట జెప్పుకోవాల్సిందే. ఈ ఆనవాయితీ ఏళ్ల నుంచీ కొనసాగుతూ వస్తోంది.

ఠంచనుగా వసూళ్ల పర్వం...

ఉభయ జిల్లాల్లోని దాదాపు అన్ని దుకాణాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు ఠంచనుగా మామూళ్లు వస్తూనే ఉంటాయి. వారి వ్యాపారాలను బట్టి, ప్రాంతాలను బట్టి అధికారులే ముట్టజెప్పాల్సిన మొత్తం నిర్ణయిస్తున్నారు. నగరం, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న దుకాణాలను కేటగిరీల వారిగా విభజించి మరి వసూళ్లకు పాల్పడుతున్నారు. పెద్ద దుకాణాల నుంచి రూ.15,000 నుంచి రూ.30,000 వరకు వసూలు చేస్తున్నారు. చిన్న దుకాణాల నుంచి రూ.6000 నుంచి రూ.15000 వరకు ఏటా ముడుపుల రూపంలో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా కార్యాలయంలో ఏ దస్త్రం కదలాలన్నా ముడుపుల్లేనిదే పని పూర్తికాదు.

సంతకానికింత.. పనులు కావలంటే అంత...

కొత్తగూడెం జిల్లాలోని ఓ మండల అధికారి వసూళ్ల పర్వం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తగా లైసెన్సు కావాలంటే రూ.40 వేలు, రెన్యూవల్​కు రూ.30,000, ప్రతీ దుకాణం నుంచి ఏటా రూ.6 వేలు అందించనిదే కుదరదని సదరు అధికారి తెగేసి చెబుతున్నారని సమాచారం. అంతేకాదు.. చంద్రగొండ మండల అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన తర్వాత ఎరువుల దుకాణాల యజమానుల నుంచి ఇప్పుడు నేరుగా ముడుపులు తీసుకోవడం మానేశారు. చాలా మంది అధికారులు ఈ వసూళ్ల పర్వాన్ని వివిధ పద్దతుల్లో సాగిస్తున్నట్లు సమచారం. దుకాణాల బిల్లులకు సంబంధించిన పుస్తకాలపై సంతకాలు చేయాలంటే రూ.2 వేలు, పీసీ సర్టిఫికెట్లకు రూ.2500 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. దుకాణాదారులకు ఎరువుల లోడ్ వస్తే రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో వివిధ పనుల కోసం రూ.2500 వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక లైసెన్సులు ఒకరిపేరు మీద ఉండి, మరో వ్యక్తి దుకాణం నడుపుకుంటే వారి నుంచి మరికొంత అదనపు మొత్తం ముట్టజెప్పాల్సిందే. ఒక అధికారి బదిలీ అయితే మండలంలోని అన్ని దుకాణాలకు సంబంధించిన ముడుపుల వివరాలు బాధ్యతలు తీసుకున్న కొత్త అధికారికి చేరుతాయి. వసూళ్ల పర్వం యథావిథిగా సాగుతుంది.

అందుకే చూసీచూడనట్లు...

వ్యవసాయ శాఖ అధికారులకు ఠంచనుగా మామూళ్లు అందుతున్నందు వల్లనే ఎరువుల, విత్తనాలు, పురుగుల మందుల దుకాణాల నిర్వహణ తీరుపై పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటోంది. ప్రతీ సీజన్​లో అన్ని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఉన్నాయో లేదో పరిశీలించాల్సిన అధికారులు తూతూ మంత్రంగానే చేస్తున్నారు. నాసీరకం విత్తనాలు అమ్ముతున్నా.. అధిక ధరలకు ఎరువులు, మందులు విక్రయిస్తున్నా.. చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న వాదన ఉంది. కేవలం పైపైనే తనీఖీలు నిర్వహించడం, కేసులు కూడా నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఫలితంగా రైతులు ఇటువంటి దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేసి నష్టపోతున్న ఘటనలు ఏటా వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక ఆమ్యామ్యాలే కారణమని తెలుస్తోంది.

కొంతమంది అధికారులైతే నేరుగా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని వారి వారి బ్రాండ్లను మార్కెట్​లో ఎక్కువ విక్రయాలు సాగేలా చొరవ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక వసూళ్ల పర్వం ఓ ఎత్తైతే.. కొంతమంది అధికారులు ఇతరులతో కలిసి ఎరువుల దుకాణాలే నెలకొల్పి, అక్కడే ఎక్కువ విక్రయాలు జరిగేలా స్వయంగా బాధ్యతలు తీసుకోవడం గమనార్హం.

అధికారులపై ఆరోపణలు నా దృష్టికి రాలేదు..

"జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. ఎవరిపైనా ఫిర్యాదులు అందలేదు. ఒకవేళ ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం." - కె.అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.