RAIN IN KARIMNAGAR: వర్షపు నీరు పోయింది.. చేదు అనుభవమే మిగిలింది.

author img

By

Published : Sep 11, 2021, 5:43 AM IST

RAIN IN KARIMNAGAR

ఎడతెరిపిలేని వర్షం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నష్టాన్ని మిగిల్చింది. వర్షపు నీరు వెళ్లడానికి సరైన కాల్వలు లేకపోవడం, నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికావడం ప్రజలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సిరిసిల్ల మూడు రోజుల పాటు నీట మునిగి తేరుకున్నప్పటికి ఆ నష్టాన్ని మాత్రం చవిచూడక తప్పడం లేదు. వర్షపు నీరంతా వెళ్లి పోగా ప్రస్తుతం ఇళ్లలో మొత్తం బురద మిగిలింది. మరోవైపు ప్రధాన రహదారులతో పాటు కరీంనగర్‌ పట్టణంలోను రోడ్లు కోతకు గురయ్యాయి.

కాలువలు నాలాల ఆక్రమణ పట్టణాల నీటి ముంపుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల నీటిలో మునగడానికి ప్రధానంగా కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చి చెప్పారు. దీనికి ప్రధాన కారణమైన బోనాల శివారులో మొదలైన కాలువ అక్రమార్కులు పూడ్చివేయడంతో వెంకంపేట ధోబీఘాట్‌కు చేరేసరికి బాగా తగ్గిపోయింది. దీనితో కాలువలో నుంచి వచ్చిన వర్షపు నీరు సింహభాగం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే ఆ వరద రోడ్డెక్కి ఇళ్లలోకి రావడంతో దాదాపు రెండురోజుల పాటు నీటమునిగిన సామాన్లు ఇప్పుడు బురదతో నిండుకున్నాయి.

ఆక్రమణలకు ముందే అడ్డుకట్ట వేసి ఉంటే..

వెంకంపేట, ప్రగతినగర్‌, శివనగర్‌, అశోక్‌నగర్‌, పద్మానగర్, జయప్రకాశ్‌నగర్‌, అంబికానగర్‌, అనంతనగర్‌, సంజీవయ్యనగర్‌, సర్దార్‌నగర్‌ ప్రాంతాలను వరద పూర్తిగా ముంచేసింది. ఈ కాలువ ద్వారా వచ్చిన నీరు కొత్తచెరువుకు చేరుకొని నాలాల ద్వారా దామెరకుంటకు చేరాల్సి ఉంటుంది. కొత్త చెరువు కింద ఉన్న నాలాలు ఆక్రమణకు గురై ప్లాట్లుగా మారిపోయాయి. కొన్నిచోట్ల వాటిపై భవనాలు నిర్మించారు. దీనితో నాలాలు పూర్తిగా మూసుకుపోవడంతో చెరువులో నుంచి ఉప్పొంగిన నీరు రోడ్డెక్కి శాంతినగర్‌లోకి చేరడంతో ఇళ్లు మునిగిపోయాయి. ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లింది. అధికారులు ఆక్రమణలకు ముందే అడ్డుకట్ట వేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నీటమునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయటికి తేలుతున్నా.. బురద కారణంగా సామానంతా పాడైపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని

కరీంనగర్‌లో వరద కారణంగా అనేక రోడ్డు దెబ్బతిన్నాయి. విద్యానగర్‌, జ్యోతినగర్‌, జగిత్యాల రోడ్డుతో పాటు దాదాపు 15 కాలనీలు నీట మునిగాయి. నగరంలోని శాతవాహన వర్సిటీ, పద్మానగర్‌, ఆర్టీసీ వర్క్‌షాప్‌తో పాటు చింతకుంట క్రాస్‌రోడ్డు సహా పలు చోట్ల రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. స్మార్ట్‌ సిటీ నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టినా వర్షపు నీటి కోసం సరైన కాల్వలు నిర్మించకపోవడమే ప్రధాన కారణమని అధికారులే అంగీకరిస్తున్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

అదే శాశ్విత పరిష్కారం..

నాలాలపై ఆక్రమణలు తొలగిస్తే తప్ప సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని సిరిసిల్ల, కరీంనగర్‌ వాసులు సూచిస్తున్నారు. ఇళ్లలో వరద పేరుకుపోయి సామాను అంతా పాడైపోయిందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: Rain Effect: జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న సిరిసిల్ల.. ఇక ఈ కష్టాలు మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.