కష్టాల్లో సర్పంచులు.. అప్పుల పాలవుతున్న గుత్తేదారులు

author img

By

Published : Sep 24, 2021, 9:02 AM IST

కష్టాల్లో సర్పంచులు.. అప్పుల పాలవుతున్న గుత్తేదారులు

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. పల్లె ప్రగతి కింద వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రశంసలు, అవార్డులు పొందుతున్నా ఆ పనులు సొంత నిధులతో చేపట్టిన సర్పంచులు అప్పుల పాలవుతున్నారు. ఉపాధిహామీ సొమ్ము మళ్లింపు, ఆర్థిక సంఘం నిధులపై ఫ్రీజింగ్‌తో నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కావడం లేదు. నిర్దిష్ట గడువు పెట్టి రెండేళ్ల క్రితం చేసిన ఉపాధి పనులకు అప్పుడప్పుడు కొంత సొమ్ము చెల్లిస్తున్నారు. అదీ చాలా పరిమితంగా ఉంటోంది. శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, ఘనవ్యర్థాల నిర్వహణ, సీసీ రోడ్ల కోసం లక్షల్లో అప్పుచేసి ఖర్చు పెట్టిన సర్పంచులు ఆ నిధులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి వెయ్యికోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లుల పెండింగ్‌తో పాటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న అంశాన్ని గజ్వేల్‌లో మార్కుక్‌ మండలానికి చెందిన 16 మంది సర్పంచులు కలిసి చర్చించినట్లు తెలిసింది.

12,732 గ్రామాల్లో దాదాపు పనులు పూర్తి

గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రభుత్వం ఉపాధిహామీతో అనుసంధానం చేసింది. శ్మశానవాటికలు, ఘనవ్యర్థాల నిర్వహణ, సీసీరోడ్లకు సంబంధించి సర్పంచులు ముందుగానే ఖర్చు పెట్టారు. శ్మశాన వాటికలకు రూ.12.60 లక్షలు, ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్డుకు రూ.1.5 లక్షలు, సీసీ రోడ్లకు రూ.5లక్షల చొప్పున అంచనాలు రూపొందించారు. ఈ పనులకు సంబంధించి ఉపాధికూలీకు వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో కేంద్రం నుంచి జమ అవుతున్నాయి. మెటీరియల్‌ ఖర్చు కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,732 గ్రామాల్లో ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.

ఏకగ్రీవాల నిధులకూ కటకటే..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రభుత్వం అదనంగా రూ.15లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో 2,134గ్రామాలు ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు వస్తాయన్న ఆశతో సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. కొందరు అప్పులు చేసి పూర్తిచేశారు. కానీ గ్రామాలకు రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఏకగ్రీవ నిధులు మంజూరు కాలేదు. అభివృద్ధి పనుల కోసం ఆస్తులు తాకట్టుపెట్టి వడ్డీలకు డబ్బు తెచ్చినా, బిల్లులు మంజూరుకాకపోవడంతో వడ్డీ అసలును సమీపిస్తోందని ఏకగ్రీవ సర్పంచులు వాపోతున్నారు.

సర్పంచులు చేయకుంటే కార్యదర్శులపై వేటు..

అభివృద్ధి పనులు సర్పంచులతో చేయించాలని పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం వత్తిడి తెస్తోంది. సొంత నిధులతో సర్పంచులు పనులు చేయడానికి నిరాకరిస్తే ఆయా గ్రామాల కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గ్రామాలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సంఘం గ్రాంటు ఇస్తున్నప్పటికీ ఆ నిధులు వాడుకునేందుకు వీల్లేకుండా పోయింది. కళ్లముందు నిధులు కనిపిస్తున్నా బిల్లులు చెల్లించేందుకు వీల్లేకుండా ఆయా నిధులపై ఆర్థికశాఖ ఫ్రీజింగ్‌ విధించింది.

నల్గొండ జిల్లాకు చెందిన ఓగ్రామ సర్పంచి అభివృద్ధి పనుల కోసం సొంత నిధులతో పాటు రూ.2 వడ్డీకి తెచ్చి రూ.17 లక్షలు ఖర్చు చేశారు. ఏడాది తరువాత శ్మశానవాటిక, ఘనవ్యర్థాల నిర్వహణ పనుల బిల్లులు కేవలం రూ.12 లక్షలే వచ్చాయి. క్వాలిటీ చెక్‌ పేరిట 10 శాతం నిధులు ఇంకా విడుదల చేయలేదు. మరో రూ.5లక్షల బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

జీహెచ్‌ఎంసీలోనూ ఇదే తీరు

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు.. చిన్న గుత్తేదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. నెలలుగా బల్దియా బిల్లులు చెల్లించట్లేదు. ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. ముఖ్యంగా చిన్న గుత్తేదారులు చితికిపోతున్నారు. అప్పుల బాధతో హయత్‌నగర్‌కు చెందిన గుత్తేదారు నర్సింహా బుధవారం ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 9, 2021 నుంచి చేసిన పనులకు బిల్లులు ఆగాయి. ఆర్థిక విభాగంలోని కొందరు ఉన్నతాధికారులు, పలువురు జోనల్‌ కమిషనర్లు పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. బకాయిలు ఇవ్వాలని గుత్తేదారులంతా సమ్మెలో ఉంటే.. రెండు నెలల కిందట ఎల్బీనగర్‌ జోనల్‌ కార్యాలయం ఓ కాంట్రాక్టరుకు రూ.80లక్షలు చెల్లించింది. గురువారం సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం కూడా అదే మాదిరి ఓ గుత్తేదారుకు రూ.60లక్షలు చెల్లించింది. వారికన్నా కొన్ని నెలల ముందే పనులు పూర్తిచేసిన వారికి అధికారులు నిధులు మంజూరు చేయట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా రోడ్ల నిర్మాణం, నాలాల్లో వ్యర్థాల తొలగింపు, కొవిడ్‌ నివారణ చర్యలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఇతరత్రా నిర్వహణ పనులకు సంబంధించి జీహెచ్‌ఎంసీ బిల్లులు పెండింగ్‌లో పెడుతోంది.

ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్న సర్పంచులు

తెలంగాణ ఏర్పాటైన తరువాత సొంత రాష్ట్రంలో బిల్లుల కోసం సర్పంచులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పనులు పూర్తయిన రెండేళ్లకు బిల్లులు వస్తున్నాయి. దీంతో సర్పంచులు అప్పులపాలై, వడ్డీ కట్టలేక ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులివ్వాలి.

- సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ ఛాంబర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.