Telangana National Unity Vajrotsavam: విద్యుత్​ కాంతులతో ముస్తాబైన హైదరాబాద్​

author img

By

Published : Sep 15, 2022, 7:18 AM IST

Telangana National Unity Vajrotsavam

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ముఖ్య కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. జిల్లాల్లోనూ కోలహలం మొదలైంది. ఈనెల 17న ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభ కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Telangana National Unity Vajrotsavam: హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో కలిసి 75 ఏళ్లలోకి అడుగు పెడుతున్న వేళ...ప్రభుత్వం సెప్టెంబరు 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించతలపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అసెంబ్లీ, బీఆర్కేభవన్‌, జీహెచ్‌ఎంసీ, డీజీపీ కార్యాలయాలు... విభిన్న రంగుల్లో మెరిసిపోతున్నాయి. మరిన్ని ప్రభుత్వ భవనాలు, పార్కులకు కూడా విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాల్లోనూ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఘనంగా వేడుకల్ని నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులు సమీక్షించిన ఆయన... ఈనెల 16న అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించాలని సూచించారు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన సభ ఏర్పాట్లను డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి లక్షమంది హాజరయ్యే అవకాశం ఉందని.. ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని కోరారు.

ఈ సభకు ముందు హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారాభవన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గిరిజన, ఆదివాసీ, గోండు కళారూపాలతో నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలను సభకు ఆహ్వానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.