Minister Harish Rao Interview : ప్రతి పల్లెలో దవాఖానా.. సేవలందించనున్న ఎంబీబీఎస్ వైద్యులు

author img

By

Published : Nov 25, 2021, 8:30 AM IST

Minister Harish Rao, harish rao interview, మంత్రి హరీశ్ రావు, హరీశ్ రావు ఇంటర్వ్యూ

Minister Harish Rao Interview : రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 4 వేల గ్రామాల్లో దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్నింటిలోనూ ఎంబీబీఎస్‌ వైద్యులు సేవలందిస్తారని వెల్లడించారు. జిల్లాకో రేడియాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.5 లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి హరీశ్ రావుతో ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖి...

Minister Harish Rao Interview : రాబోయే రోజుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులతో.. ప్రభుత్వ వైద్యం పోటీపడాలనేదే తమ ఆకాంక్ష అని, ఆ దిశగా సర్కారు వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానాలతో మంచి ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్‌ పల్లె దవాఖానాల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. త్వరలో నాలుగు వేల పల్లె దవాఖానాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్‌రావు.. ‘ఈనాడు-ఈటీవీభారత్​’తో ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు.

  • పల్లె దవాఖానాలు ఎలా ఉంటాయి?

hospitals in villages Telangana : ప్రతి పల్లె దవాఖానాలోనూ ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడు అందుబాటులో ఉంటారు. తద్వారా గ్రామీణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తాం. నకిలీ వైద్యుల బారినపడకుండా కాపాడతాం. వాటిలో పాము, తేలు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచుతాం. దీంతో ప్రాణాపాయం తప్పుతుంది.

  • కార్పొరేట్‌ ఆసుపత్రుల స్థాయి సేవలు ప్రభుత్వ వైద్యంలో అందించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతున్నారు?

Radiology labs in districts Telangana :రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఇందులో ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, 2డీ ఎకో, సీటీ స్కాన్‌, మామోగ్రామ్‌ తదితర పరీక్షలను ఉచితంగా చేస్తారు. గర్భిణికి గుండె సమస్యో, మూత్రపిండాల సమస్యో ఉన్నప్పుడు.. ఆ కేసును స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి అతి ముప్పు ఉన్న గర్భిణులకు ఎదురయ్యే సమస్యలకు సత్వర చికిత్స అందించాలి. అందుకోసం నిమ్స్‌లోనూ 200 పడకలతో అత్యాధునిక మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి(ఎంసీహెచ్‌)ని నెలకొల్పనున్నాం. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి, కేంద్ర కారాగారం, కాకతీయ వైద్య కళాశాలల్లో కలుపుకొని 215 ఎకరాల్లో ‘వరంగల్‌ ఆరోగ్య నగరం(హెల్త్‌ సిటీ)’గా తీర్చిదిద్దనున్నాం. ఏడాదిన్నర లోగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తాం.

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు పెరుగుతున్నాయి? దీన్నెలా చూడాలి?

Cesareans in government hospitals telangana : సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నాం. దీనికోసం మిడ్‌ వైఫరీ నర్సులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే వారిని 12 ఆసుపత్రుల్లో నియమించాం. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్‌ఐసీయూలను 18 నుంచి 42కు పెంచుకున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేకంగా 5 ఐసీయూలను నెలకొల్పాం. శస్త్రచికిత్సలు పెరగడం వల్ల శిశువులకు వెంటనే తల్లి పాలు అందించడం సాధ్యం కావడం లేదని మా పరిశీలనలో వెల్లడైంది. ఈ రెండింటిపైనా దృష్టిపెట్టాం.

  • శవాగారాల్లో దుర్భర పరిస్థితులున్నాయి. వీటిని చక్కదిద్దే ప్రణాళిక ఉందా?

అత్యధిక ఆసుపత్రుల్లో శవాగారాలు తీవ్ర దుర్గంధంతో, కనీస వసతులు లేకుండా ఉన్నాయనే అంశం నాదృష్టికి వచ్చింది. ఎయిర్‌ కండిషన్డ్‌ ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్య పరిష్కరించేలా అత్యాధునిక ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకురానున్నాం. మురుగునీరు బయటకు వెళ్లేలా నిర్మాణాల్లో మార్పులుచేయాలని ఆదేశాలిచ్చాం. ఇందుకోసం రూ.25 కోట్లు మంజూరు చేయబోతున్నాం.

  • రక్తశుద్ధి కేంద్రాలు అవసరాలకు సరిపడా లేవనే అభిప్రాయముంది?

రాష్ట్రంలో 2014కు ముందు కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలుండేవి. ఇప్పుడు 43కు పెంచాం. వీటి ద్వారా 10వేల మందికి సేవలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఈ పథకం కింద ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చుచేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘సింగిల్‌ యూజ్‌ డయాలైజర్‌’ వినియోగించే విధానాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నాం. అయినా కొన్నిచోట్ల ఇబ్బందులున్నాయి. ఆయా ప్రాంతాల్లో డయాలసిస్‌ పడకల సంఖ్యను పెంచాలని ఇప్పటికే నిర్ణయించాం. వారం రోజుల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం.

  • వైద్యులు, సిబ్బంది సకాలంలో దవాఖానాలకు రావడంలేదనే ఆరోపణలున్నాయి?

ఈ అంశంపై దృష్టిసారించాం. ఆశాలు మొదలుకుని సూపరింటెండెంట్ల వరకూ వైద్యులు, సిబ్బంది పనితీరును అంచనా వేయాలని నిర్ణయించాం. ప్రతినెలా వైద్యుడు, ఇతర సిబ్బంది ఏమేమి సేవలందించారనే వివరాలు తెప్పించుకుంటాం. ఉదాహరణకు కొన్నిచోట్ల రూ.కోట్ల విలువైన పరికరాలు అందుబాటులో ఉన్నా వినియోగించడం లేదు. అందులో వినియోగించే రసాయనాలనూ(రీయేజెంట్లు) అడగడం లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాం. అంకితభావంతో పనిచేసే వారికి ప్రోత్సాహకాలిస్తాం. తద్వారా వారిలో మార్పుతీసుకొస్తాం.

  • హైదరాబాద్‌ చుట్టూ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు ప్రక్రియ ఏ దశలో ఉంది?

super speciality hospitals in Hyderabad : ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్కో ఆసుపత్రికి సుమారు రూ.1000 కోట్లు వ్యయమవుతుందని అంచనా. కొంత సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మరికొంత బ్యాంకు రుణంగా తీసుకుని నిర్మాణాలు పూర్తిచేస్తాం. ఎన్నికల కోడ్‌ ముగియగానే అన్నింటికీ శంకుస్థాపన చేస్తాం. వరంగల్‌ ఆరోగ్య నగరంలో రెండు వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తాం.

  • కొవిడ్‌ మూడోదశకు సన్నద్ధమెలా?

Corona third wave news : ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలకూ ప్రాణవాయువు సౌకర్యం అందిస్తున్నాం. ఇప్పటికే 15,203 బెడ్‌లను కొవిడ్‌ సేవల కోసం సిద్ధంచేశాం. ఇందులో 2,170 ఐసీయూ, 13,033 సాధారణ ఆక్సిజన్‌ పడకలున్నాయి. పిల్లల కోసం నిలోఫర్‌ ఆసుపత్రిని 2,000 పడకలకు అభివృద్ధి చేస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రాణవాయువు ప్లాంట్లను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నాం.

  • ఆయుష్మాన్‌ భారత్‌ సరిగా అమలు కావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి? మీరేమంటారు?

Aarogyasri limit : ఆయుష్మాన్‌ భారత్‌ను మే నెల 18 నుంచే రాష్ట్రంలో అమలుచేస్తున్నాం. దీంతో రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ చికిత్స పరిధి రూ.5 లక్షల వరకూ పెరిగింది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని 90.4 లక్షల మంది లబ్ధిదారులు సేవలు పొందుతున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వచ్చేది కేవలం 26.1 లక్షల మందే. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రాష్ట్రానికి వచ్చేది సుమారు రూ.150 కోట్లు మాత్రమే. అన్ని ఆసుపత్రుల్లోనూ రెండు పథకాల పేర్లతో బోర్డులు పెట్టాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.

ఇదీ చదవండి : Covid cases in India: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.