'రచన'కు అండగా రామన్న.. ఆమె అభిమానానికి కేటీఆర్ ఎమోషనల్

author img

By

Published : Sep 19, 2022, 8:07 PM IST

KTR

ఎంతో మంది చదువులో మంచి ప్రతిభ కనబరిచి.. ఉన్నత స్థానాలను అధిరోహించి.. జీవితంలో హుందాగా బతకాలని కలలు కంటుంటారు. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్లనీయవు. వారి కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మంత్రి కేటీఆర్ అలాంటి వారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా ఓ విద్యార్థిని కేటీఆర్ నుంచి సాయం పొంది నాలుగు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ యువతి ఇవాళ ప్రగతిభవన్​లో కేటీఆర్​ను కలిశారు.

ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యముంటుంది. దాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడతారు. అదే ఆడ బిడ్డల విషయానికొస్తే.. చాలా మంది కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. పురుషాధిక్య సమాజంలో తమ కలను నెరవేర్చుకునే వారు తక్కువనే చెప్పాలి. సామాజిక మాధ్యమాలు, పార్టీ శ్రేణుల ద్వారా అలాంటి వారి గురించి తెలుసుకొని వారికి వ్యక్తిగతంగా సాయం చేయడంలో మంత్రి కేటీఆర్‌ ఎప్పుడూ ముందుంటారు. కేటీఆర్‌ నుంచి సాయం పొంది ఏకంగా నాలుగు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని రుద్ర రచన ఇవాళ ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్‌ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ సీటు పొందింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర తన ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. ఆ సమయంలో ఆమె ఆర్థిక ఇబ్బందులను 2019లో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్, విద్యార్థిని రుద్రను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

చివరి సంవత్సరం ఫీజుల కోసం రచనకు నగదు సాయం అందిస్తున్న కేటీఆర్

అన్నలా అండగా నిలబడ్డారు.. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్​ వ్యక్తిగతంగా సమకూర్చారు. కేటీఆర్​ నుంచి పొందిన ఆర్థిక సాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 4 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా రుద్ర రచన ఇవాళ ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కలల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనైంది. దాచుకున్న డబ్బుతో ప్రత్యేకంగా తయారుచేయించిన వెండి రాఖీని కేటీఆర్​కు కట్టారు.

భావోద్వేగానికి లోనైన కేటీఆర్.. రుద్ర రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన విజయాన్ని చూసి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రచన చేత వెండి రాఖీ కట్టించుకున్న మంత్రి కేటీఆర్ ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్న తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజినీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిల కోసం అవసరమైన మొత్తం నగదు సాయాన్ని మంత్రి కేటీఆర్ అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.