American Ship to Vizag : విశాఖకు 12 అంతస్తుల అమెరికా నౌక..

author img

By

Published : Aug 3, 2022, 2:08 PM IST

AMERICA WARSHIP

American Ship to Vizag : జలాంతర్గాములకు వెన్నుదన్నుగా నిలిచేలా సమగ్ర వసతులున్న యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ మంగళవారం విశాఖ నౌకాశ్రయానికి చేరుకుంది. ఎల్‌.ఐ.స్పియర్‌ శ్రేణికి చెందిన దీనిని 1979లో అమెరికా నౌకాదళంలో ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

American Ship to Vizag : జలాంతర్గాములకు వెన్నుదన్నుగా నిలిచేలా సమగ్ర వసతులున్న యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ మంగళవారం విశాఖ నౌకాశ్రయానికి చేరుకుంది. దాని ప్రత్యేకతలు, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నౌక నుంచి జలాంతర్గామిలోకి వేగంగా రాకపోకలు సాగించడానికి వీలుగా రెండింటినీ అనుసంధానం చేసే సౌకర్యం ఉండడం దీని ప్రత్యేకత. సముద్రంలోకి దిగి అవసరమైన మరమ్మతులు చేయడానికి వీలుగా నలుగురు నిపుణులైన డైవర్లు ఉంటారు.

మనుషులు వెళ్లలేని పరిస్థితుల్లో పంపేందుకు ఒక ప్రత్యేక రోబో కూడా వీరి వద్ద ఉంది. సాధారణ జలాంతర్గాములతోపాటు అణు జలాంతర్గాములను కూడా అత్యంత వేగంగా సుశిక్షితులైన ఇంజినీర్లు, ఇతర నిపుణులు మరమ్మతు చేయగలరు.

రెండు రబ్బరు పడవలను సాధారణ సమయాల్లో గాలిని తీసేసి మడత పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు గాలిని నింపి సముద్రంపై ప్రయాణించేలా మార్చుకోవచ్చు. ఇందులో మిలటరీతోపాటు సివిలియన్‌ ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి నాలుగు జలాంతర్గాములకు సేవలు అందించగలిగేలా దీన్ని తీర్చిదిద్దారు. లాక్‌హీడ్‌ నౌకా నిర్మాణ సంస్థ తయారుచేసిన ఈ యుద్ధనౌకను ఎ.ఎస్‌.40 యుద్ధనౌకగా కూడా పేర్కొంటారు.

జలాంతర్గాముల విడిభాగాలు తయారుచేసే అంతస్తులోని యంత్రాలు


ప్రత్యేకతలెన్నో.. జలాంతర్గాముల మరమ్మతులకు అవసరమయ్యే సుమారు 30 వేల విడిభాగాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. మరమ్మతులకు నట్లు, బోల్టులు కూడా అప్పటికప్పుడు తయారుచేయడానికి వీలుగా ఒక అంతస్తు మొత్తంలో పలు యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు.


యుద్ధనౌకలోని అధునాతన పడవ

సమరానికీ సై.. కేవలం మరమ్మతులే కాకుండా యుద్ధం చేయడానికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలు కూడా ఇందులో ఉన్నాయి. పలు టోర్పెడోలను కూడా ఉంచారు. ఇందులోనే ఒక ఆసుపత్రి కూడా ఉంది. కాలుష్య నియంత్రణ కార్యకలాపాలకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఐదు టన్నుల క్రేన్‌ ఒకటి, 30 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్‌ ఉన్నాయి. ఉద్యోగులకు అవసరమైన అత్యంత ఆహ్లాదకరమైన సౌకర్యాలు, హెలీకాప్టర్‌ దిగడానికి వీలుగా పై అంతస్తులో తగిన ఖాళీస్థలం, ఇతర సదుపాయాలున్నాయి.

చుంగ్‌, అటార్నీ, ప్రజా వ్యవహారాల అధికారిణి

స్నేహ సంబంధాలు బలోపేతమే లక్ష్యం.. 'భారత నౌకా దళంతో స్నేహసంబంధాలను మరింతగా మెరుగుపరచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవడం మా పర్యటన ప్రధాన లక్ష్యం. అవసరమైనప్పుడు ఇరు నౌకాదళాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కలిసి విధులు నిర్వర్తించడానికి కూడా మా పర్యటన ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ఇరు దేశాలూ మరింత పట్టు సాధించొచ్చు. మొట్టమొదటిసారిగా విశాఖ నౌకాశ్రయానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాలుగో తేదీ వరకూ మేం ఇక్కడ ఉంటాం.' చుంగ్‌, అటార్నీ, ప్రజా వ్యవహారాల అధికారిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.