వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించిన అగ్రిగోల్డ్ బాధితులు

author img

By

Published : May 9, 2022, 2:07 PM IST

Consumer Commission

Consumer Commission News: అగ్రిగోల్డ్ కుంభకోణం 2014లో డిపాజిట్లు కట్టి మోసపోయామంటూ కొందరు బాధితులు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. కట్టిన డబ్బు తిరిగి ఇప్పించడంతో పాటు పరిహారం, కేసు ఖర్చులు చెల్లించేలా ఆదేశించాలని కోరారు.

Consumer Commission News: ఆరువేల కోట్లకు పుట్టిముంచిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం 2014లో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో బాధితులు కొందరు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. డిపాజిట్లు కట్టి మోసపోయామంటూ... కట్టిన డబ్బు తిరిగి ఇప్పించడంతో పాటు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. డబ్బులు పెట్టుబడిగా పెట్టండి... ఆరున్నరేళ్లలో రెట్టింపు సొమ్ము సొంతమవుతుంది... లేదంటే దానికి బదులు రెసిడెన్షియల్‌ ప్లాటు ఇస్తామన్న ఆశ చూపడంతో ఎంతో మంది ఈ స్కీమ్‌లో చేరారు.

హైదరాబాద్​లోని రామంతపూర్‌కు చెందిన పి.పవన్‌కుమార్, పి.భూనాథ్, పి.ప్రవీణ్‌కుమార్‌లు వేర్వేరు స్కీమ్‌లలో వరుసగా రూ.2,34,500, రూ.1,10,000, రూ.30వేలు చెల్లించారు. సిల్వర్‌లైన్‌ ప్రాజెక్టు, పరివార్‌ స్కీమ్, ఓన్‌ఏల్యాండ్‌ స్కీమ్‌ తదితర పేర్లతో డిపాజిటర్ల నుంచి వీటిని సేకరించారు. పేరుకు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌బీఐ, సెబీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం సాగింది. ఇక వాగ్దానాల మేరకు సొమ్ము చెల్లించడంలో, ఫ్లాట్లను రిజిస్టర్‌ చేయడంలో అగ్రిగోల్డ్‌ సంస్థ చేతులెత్తేసింది. మెచ్యురిటీ అనంతరం ఖాతాదారులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతూ వచ్చాయి. చివరికీ మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌−1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు పి.రామ్‌మోహన్, సి.లక్ష్మి ప్రసన్నతో కూడిన బెంచ్‌ బాధితులకు డబ్బులు రీఫండ్‌ చేయాలని ఆదేశించింది. దాంతో పాటు పవన్‌కుమార్‌కు పరిహారం రూ.15వేలు, కేసు ఖర్చులు రూ.10వేలు, భూనాథ్‌కు రూ.10వేలు పరిహారం, కేసు ఖర్చులు రూ.5వేలు, ప్రవీణ్‌కుమార్‌కు రూ.5వేలు పరిహారం, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. 45 రోజుల గడువులో డబ్బులు రీఫండ్‌ చేయడంతో పాటు మిగతా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. లేనిపక్షంలో 12శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఖతార్ ఎయిర్‌వేస్‌పై వినియోగదారుల కమిషన్ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.