Revanth Reddy : 'నా మాటలకు వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Aug 5, 2022, 12:28 PM IST

Revanth Reddy on MP Venkat Reddy

Revanth Reddy on MP Venkat Reddy : ''మీరు' వెన్నుపోటు పొడుస్తున్నారు' అని కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్​రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అపోహలతో వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.

Revanth Reddy on MP Venkat Reddy : రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్‌రెడ్డి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందునే ఆయన అపార్థం చేసుకున్నట్లు చెప్పారు. రాజగోపాల్‌రెడ్డిని సొంత పార్టీని ముంచేందుకు యత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్టుల గురించి తేల్చేందుకే చండూరుకు వస్తున్నామన్న రేవంత్‌..... నిజాయితీపరుడైతే తమతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

"కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరు.. రాజగోపాల్‌రెడ్డి వేరు. రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీకి ద్రోహం చేశాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మా కుటుంబసభ్యుడు. నా కంటే సీనియర్‌ నేత.. తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ద్రోహి. నా వ్యాఖ్యలకు వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధంలేదు. రాజగోపాల్‌రెడ్డిని మాత్రమే మీరు అని సంభోదించాను. నాకు, వెంకట్‌రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టిస్తున్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరంలేదు. రాజగోపాల్‌రెడ్డి సవాళ్లకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. టెండర్లు, కేసీఆర్‌పై పోరాటంపై చండూరుకు వచ్చి మాట్లాడుతా." అని రేవంత్ రాజ్​గోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.

తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్‌ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రాండ్‌ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్​రెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు. ఈ విషయంపైనే తాజాగా రేవంత్ స్పందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.