kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్

author img

By

Published : Oct 1, 2021, 8:38 PM IST

Updated : Oct 1, 2021, 10:26 PM IST

Pill in High Court on Kaleshwaram project third TMC works

20:35 October 01

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్

కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) మూడో టీఎంపీ పనులపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. అదనపు టీఎంసీ పనులపై సిద్ధిపేట జిల్లా తొగుట్ట మండలం తుక్కాపూర్​కు చెందిన సీహెచ్.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనుమతుల్లేకుండా.. కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రోజుకు రెండు టీఎంసీల ఎత్తిపోతలకే అనుమతులు ఉన్నాయని... అదనపు టీఎంసీ కోసం పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు.. ఎన్జీటీ కూడా ఆదేశించిందన్నారు. మూడో టీఎంపీ పనులు చేపట్టడంతో పాటు.. దాని పేరిట రుణాలు కూడా తీసుకుంటోందని వాదించారు. వెంటనే పనులు ఆపడంతో పాటు.. సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అప్పటి వరకు పనులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థనను జస్టిస్ షమీమ్ అక్తర్​, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్​లో అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మూడో టీఎంసీ పనుల అంచనా..

రోజుకు రెండు టీఎంసీల నీటిని మళ్లించేలా మొదట కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య బ్యారేజీలు, మధ్యమానేరు దిగువన రిజర్వాయర్లు, లిప్టులు, సొరంగమార్గాలు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ, పునరావాసం ఇలా అన్నీ కలిపి 80,500 కోట్ల రూపాయల అంచనాకు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే సమయంలో మేడిగడ్డ నుంచి రోజూ మూడు టీఎంసీలు మళ్లించేలా పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ మళ్లింపునకు సంబంధించిన లిప్టు పనులూ దాదాపు పూర్తయ్యాయి. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు పనులు జరుగుతున్నాయి. రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసేందుకు అంచనా సుమారు లక్షా 15 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు..

Last Updated :Oct 1, 2021, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.