ETV Bharat / city

Punishment for Minor Driving: మైనర్లు రోడ్డు ప్రమాదం చేస్తే.. తల్లిదండ్రులకు జైలు శిక్ష

Punishment for Minor Driving: వాహనాలు నడుపుతున్న మైనర్లపై హైదరాబాద్​ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మైనర్లు కార్లు, బైకులు నడుపుతూ పట్టుబడినా.. సీసీ కెమెరాలకు చిక్కినా.. వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ప్రమాదాలు చేస్తో వారి తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు పంపనున్నారు.

Minor Driving Punishment
Minor Driving Punishment
author img

By

Published : February 1, 2022 at 9:16 AM IST

Choose ETV Bharat

Punishment for Minor Driving : భాగ్యనగరంలో బైకులు, కార్లు వేగంగా నడుపుతూ వెళ్తున్న మైనర్లపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్‌ కమాన్‌ ప్రాంతంలో మైనర్లు కారు నడిపి నలుగురి మరణానికి కారణమైన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కార్లు, బైకులు నడుపుతూ పట్టుబడినా.. సీసీ కెమెరాలకు చిక్కినా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రమాదాలు చేస్తే వారి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపనున్నారు. కొన్ని ప్రాంతాల్లో 14 ఏళ్ల పిల్లలు కూడా కార్లు, బైకులు నడుపుతున్నారన్న సమాచారంతో సంయుక్త కమిషనర్‌ (ట్రాఫిక్‌) ఏవీరంగనాథ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలపై చట్టపరంగా వ్యవహరించాలని, మైనర్లపై కోర్టుల్లో అభియోగపత్రాలు సమర్పించాలని ఆదేశించారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వారంతాల్లో రేసులు నిర్వహిస్తూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి వీరి దూకుడు కొందరి ప్రాణాల మీదికి తెస్తుండగా మరికొన్ని సందర్భాల్లో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

నాలుగింటిలో ఒక ప్రమాదం మైనర్ల వల్లే..

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి 4 ప్రమాదాల్లో ఒకటి మైనర్లు చేస్తున్నారు. నగరం, శివార్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, పాతబస్తీలోని యువకులు కొత్తబైక్‌లు, ఖరీదైన వాహనాలను కొంటున్నారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తున్నారు. దీంతోపాటు నార్సింగి, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ఉదయం వేళల్లో 120-140 కిమీ వేగంతో వెళ్తున్నారు. నెక్లెస్‌ రోడ్‌లో పోలీసులు, మౌంటెడ్‌ పోలీసుల నిఘా ఉన్నా ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధుల్లో నమోదవువుతున్న మొత్తం ప్రమాదాల్లో 60 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనదారుల కారణంగా సంభవిస్తున్నాయి.

పట్టుకుంటే జైలుశిక్ష, జరిమానా

బైకులు, కార్లు నడుపుతున్న వారిలో మైనర్లు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్పట్లో హెచ్చరించి వదిలేసేవారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు చేసినప్పుడు మాత్రం చట్టపరంగా కేసులు నమోదు చేసి జరిమానా విధించి వదిలేస్తున్నారు. కొద్దిరోజులుగా శాంతిభద్రతల పోలీసులకు సమాచారమిచ్చి కేసులు నమోదు చేయిస్తున్నారు. అయితే ఇకపై మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులను జైలుకు పంపడంతో పాటు రూ.25 వేల జరిమానా చెల్లించాల్సి వస్తుంది మరి.