ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్​పీఏల దందా నడుస్తోంది..: సీఎం కేసీఆర్​

author img

By

Published : Aug 6, 2022, 6:55 PM IST

NPA become a big scam in india Qouted CM KCR

CM KCR Comments on NPA: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్​ విమర్శనాస్త్రాలు సంధించారు. నీతిఆయోగ్​ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్​.. అందుకు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని తెలిపారు. ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక.. ఎన్​పీఏ విలువ ఏకంగా పది రేట్లు పెరిగిందని కేసీఆర్​ ఆరోపించారు.

CM KCR Comments on NPA: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్​పీఏల విలువ ఏకంగా పది రెట్లు పెరిగిందని సీఎం కేసీఆర్​ తెలిపారు. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యి ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇది ఒక పెద్ద కుంభకోణమని ఆక్షేపించారు. కొన్ని సంస్థలకు ఎన్‌పీఏ పేరిట రూ.12 లక్షల కోట్లు ఇచ్చారని కేసీఆర్​ పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్ల ఎన్‌పీఏలు రూ.20 లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది భాజపా ప్రభుత్వ పనితనానికి నిదర్శనమా..? అని ప్రశ్నించారు. మహత్తరమైన పాలన అందిస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? ఎందుకు 10 రెట్లు పెరిగిందని నిలదీశారు.

ఇప్పుడు.. ఉచితాలు బంద్​ అనే కొత్త రాగం ఎత్తుకున్నారని కేసీఆర్​ ఎద్దేవా చేశారు. పేదలకు ఎంతో కొంత చేయూతగా ఉండి ఆదుకోవాలని పెట్టే పథకాలను తీసేయాలనటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కొందరు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల దగ్గరి తీసుకున్న లక్షల కోట్ల లోన్​లను మాఫీ చేస్తూ.. పేదలకు అందే సంక్షేమ పథకాలను తీసేయాలంటున్నారని మండిపడ్డారు. కాకిని కొట్టి గద్దకు వేసే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందని కేసీఆర్​ ధ్వజమెత్తారు.

మేక్​ ఇన్​ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన కేంద్రం.. కందిపప్పు నుంచి గాలిపటం ఎగరేసే దారం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని కేసీఆర్​ వివరించారు. మేక్​ ఇన్​ ఇండియా అనే కార్యక్రమం నిజంగానే సక్రమంగా జరిగుంటే.. ఎన్​పీఏలు ఎందుకు పెరుగుతాయని ప్రశ్నించారు. ఒకప్పుడు మేథోవలస జరిగితే ఇప్పుడు సంపద వలస జరుగుతోందన్నారు. విదేశీ మారక నిల్వలు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలోనూ శ్రీలంక తరహా పరిస్థితి వచ్చేలా ఉందని కేసీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఉచితాలు బంద్‌ చేయాలని ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకున్నారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా? రైతులకు రైతుబంధు, రైతుబీమా ఇవ్వడం ఉచితమా? రైతులకు ఉచిత విద్యుత్‌, బీమా ఇవ్వటం తప్పా? కొన్ని సంస్థలకు ఎన్‌పీఏ పేరిట రూ.12 లక్షల కోట్లు ఇచ్చారు. రూ.2 లక్షల కోట్ల ఎన్‌పీఏలు రూ.20 లక్షల కోట్లకు ఎందుకు పెరిగింది. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యి ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు. కొందరు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. ఒకప్పుడు మేథోవలస జరిగితే ఇప్పుడు సంపద వలస జరుగుతోంది. విదేశీ మారక నిల్వలు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. మనదేశంలోనూ శ్రీలంక తరహా పరిస్థితి వచ్చేలా ఉంది." - సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.