Online Cinema Tickets in AP: ఆన్​లైన్​లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: పేర్ని నాని

author img

By

Published : Nov 24, 2021, 5:21 PM IST

Online Cinema Tickets: ఆన్​లైన్​లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: పేర్ని నాని

అధిక ధరలకు సినిమా టికెట్లు అమ్మకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి పేర్ని నాని (Perni nani On Online Cinema Tickets) స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ద్వారా ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు మార్గం సుగమమైందన్నారు. ప్రేక్షకులను దోపిడీ నుంచి కాపాడేందుకే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.

సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ద్వారా ఆన్​లైన్​లో సినిమా టికెట్ల విక్రయాలకు మార్గం సుగమమైందని (Online Cinema Tickets in ap) ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు థియేటర్ యజమానుల ఇష్టానుసారం టికెట్ల విక్రయాలు జరిగేవని.., ప్రజలను దోచుకునే పరిస్థితిని నియంత్రించేందుకే ఆన్​లైన్ విధానం తీసుకొచ్చామని వివరించారు. బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా చూస్తామన్నారు.

రాష్ట్రంలోని 1100 థియేటర్లలో ఆన్​లైన్​లో టికెట్ విక్రయాలు చేపడతామని స్పష్టం చేశారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల ధర బ్లాక్​లో రూ.200 నుంచి రూ.1000 వరకు విక్రయించే విధానం గతంలో ఉండేదని.., అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఇక నుంచి బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించినట్లు మంత్రి నాని తెలిపారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని.., చారిటీస్ కోసం మాత్రమే ఈ షోలకు అనుమతి ఇస్తామన్నారు. చట్ట ప్రకారం ఇక నుంచి రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రాబడి విషయంలోనూ ఇబ్బందులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం టికెట్లు విక్రయించే పోర్టల్ మాత్రమే నిర్వహిస్తుందని.., సినిమా టికెట్లపై వ్యాపారం చేయబోదన్నారు. థియేటర్ల పేరుతో రుణాలు తెచ్చుకునే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చిన్నా పెద్దా హీరోలు, రెమ్యునరేషన్ అనే వ్యత్యాసం లేదని అన్నారు.

"సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాం. 1100 థియేటర్లలో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం చేపడతాం. అధిక ధరలకు టికెట్లు అమ్మకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇకపై బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించాం. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంది. సేవా కార్యక్రమాల కోసమే బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తాం. ప్రభుత్వం పోర్టల్ మాత్రమే నిర్వహిస్తుంది. సినిమా టికెట్లపై వ్యాపారం చేయదు. టికెట్ల అమ్మకంతో రుణాలు తెచ్చుకునే యోచన లేదు."- పేర్ని నాని, ఏపీ మంత్రి

వాహన పన్నుల చట్టంలోనూ సవరణలు చేసినట్లు మంత్రి పేర్ని నాని వివరించారు. పాత వాహనాలను నియంత్రించేందుకు హరిత పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. మోటారు సైకిళ్లకు, ఆటోలకు ఈ పెంపు వర్తించదన్నారు. రూ.20 లక్షల విలువ దాటిన నాలుగు చక్రాల వాహనాలకు 4 శాతం పన్ను విధింపు ఉంటుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

"వాహన పన్నుల చట్టంలోనూ సవరణలు చేశాం. పాత వాహనాల నియంత్రణకు హరితపన్ను. మోటారు సైకిళ్లు, ఆటోలకు హరితపన్ను లేదు. రూ.20 లక్షలు దాటిన 4 వీలర్లకు 4 శాతం పన్ను."- పేర్ని నాని, ఏపీ మంత్రి

ఇదీ చదవండి

ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు శుభవార్త.. ఇక నుంచి డయాలసిస్ ఉచితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.