KTR on Handloom: చేనేత కార్మికులకు కనీస ఆదాయం పెరిగేలా...

author img

By

Published : Sep 7, 2021, 7:03 PM IST

KTR

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుతో చేనేత కార్మికుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. చేనేత, జౌళిశాఖపై సమీక్షించిన కేటీఆర్​... ప్రభుత్వ పథకాలు, అమలు తీరుపై చర్చించారు.

చేనేత, జౌళిశాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి సంఘాలు, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్లు విడుదల చేసింది. శాఖలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిపై మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలపై రెండు వారాల క్రితం ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి నిర్వహించిన సమీక్షకు కొనసాగింపుగా అధికారులతో ఇవాళ మరోమారు సమీక్షించారు.

ఆ పథకాలకు నిధుల విడుదల

చేనేత సహకార సంఘాలకు రాయితీతో నూలు, రంగుల పథకానికి నిధుల విడుదల, పావలా వడ్డీ, మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం కింద నిధుల విడుదల, టెస్కో పరిహారం చెల్లింపు, చేనేత మిత్ర కార్మికులకు రాయితీ, క్యాష్ క్రెడిట్ రుణాల చెల్లింపు, థ్రిఫ్ట్ ఫండ్ పథకం పున:ప్రారంభం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి రూ.73.50 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా నేతన్నకు చేయూత కింద 54 వేల మంది చేనేత కార్మికులకు రూ.30 కోట్లు విడుదల చేశారు.

సంఘాలు పరిపుష్టమై...

చేనేతమిత్ర కింది 20 వేల మంది కార్మికులకు రూ.14.49 కోట్లు, టెస్కో నిధులు 73 సంఘాలకు రూ.14 కోట్లు విడుదల చేశారు. మార్కెటింగ్ ప్రోత్సాహక పథకం కింద 48 సంఘాలకు రూ.7 కోట్లు... నూలు, రంగుల రాయితీ కింద మూడు కోట్ల రూపాయలు విడుదల చేశారు. విడుదల చేసిన నిధులను ఆయా సంఘాలు, కార్మికులకు తక్షణమే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్... పథకాల అమలుతో చేనేత కార్మికుల తలసరి ఆదాయాలు వృద్ధి చెందడమే కాకుండా సహకార సంఘాలు పరిపుష్టమై కార్మికులకు 365 దినాలు సంపూర్ణంగా పని లభిస్తుందని అన్నారు.

కనీస ఆదాయం పెరిగేలా..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేనేత కార్మికుల నెలసరి ఆదాయాలు కనీసం రూ.15 వేలు మించి పొందేందుకు ఆస్కారం ఏర్పడిందని కేటీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన... అందులో భాగంగా చేనేత రంగాన్ని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి : Rain Effect: చేపలకు బదులు కోళ్లు కొట్టుకొచ్చాయి.. ఆ గ్రామస్థులకు పండగే పండగ...

ఇదీ చదవండి: Smart Criminal: అతని వలలో 30 మంది.. ఎలా మోసం చేశాడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.