'మెట్రో, ఎంఎంటీఎస్‌లను అనుసంధానించండి..'

'మెట్రో, ఎంఎంటీఎస్‌లను అనుసంధానించండి..'
KTR Meet Union Minister : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ను మంత్రి కేటీఆర్ దిల్లీలో కలిశారు. హైదరాబాద్‌లో పీఆర్టీసీ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు.
KTR Meet Union Minister: హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ (పీఆర్టీసీ) ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. జనాభా, ఉపాధి అవకాశాల పెరుగుదలతో మహా నగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 69 కి.మీ.మెట్రో రైలు నెట్వర్క్, 46 కి.మీ.ఎంఎంటీఎస్ మార్గం ఉందని తెలిపారు.
మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌లకు అనుసంధానంగా పీఆర్టీఎస్, రోప్‌వే సిస్టమ్స్ వంటి మెరుగైన వసతుల కోసం తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా శాసనసభ నుంచి ప్యారడైజ్ మెట్రోస్టేషన్ వరకు 10 కి.మీ. పొడవైన పీఆర్టీ కారిడార్‌ను ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.
కారిడార్ సాధ్యాసాధ్యాల అధ్యయనం, డీపీఆర్‌లకు కన్సల్టెంట్‌గా ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఐపీఆర్‌ఆర్‌సీఎల్) ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టు ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం హైపవర్ కమిటీతో సమన్వయం చేయాలని కోరారు. హైదరాబాద్‌లో 62 మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ వివరించారు. వీటి నిర్మాణానికి రూ.8,684.54 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. అమృత్-2 కింద ఈ ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు రూ.2,850 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఇవి పూర్తయితే నగరంలో మూసీనదితో పాటు ఇతర నీటి వనరుల్లో మురుగును తగ్గించే వీలుంటుందన్నారు.
