దొంగతనం చేశాను కదా.. నన్ను అరెస్టు చేయాల్సిందే!

author img

By

Published : Sep 15, 2022, 8:27 PM IST

arrest

ఓ వ్యక్తి మందుల దుకాణంలోకి ప్రవేశించాడు.. చోరీ చేయాలనేది అతని ఉద్దేశ్యం. మూడు సబ్బులు తీసుకున్నాడు.. కానీ.. తనను ఎవ్వరూ చూడట్లేదని మళ్లీ అక్కడే పెట్టేశాడు.. సిబ్బంది దృష్టి తనపై పడేవరకూ ఆగాడు. వాళ్లు ఎప్పుడైతే తనను చూశారో.. వెంటనే మూడు సబ్బులు దొంగిలించాడు! సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చి.. అతన్ని పట్టుకున్నారు. చోరీ చేసినందకు తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేశారు.. కస్టమర్లలో ఒకరు వచ్చి అతను చోరీ చేసిన సబ్బులకు డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. కానీ.. నిందితుడు మాత్రం.. తనను అరెస్టు చేయాల్సిందేనని పట్టుబట్టాడు..! అక్కడున్నవారంతా అతన్ని పిచ్చివాడిలా చూస్తున్నారు..

జూలై 29వ తేదీ 2022.. సమయం మధ్యాహ్నం 2 గంటలు.. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని చోన్‌బురి ప్రావిన్స్‌లోని ఒక మెడికల్ షాప్.. 60 ఏళ్ల వయసున్న ఫిచిట్‌ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఆ షాపులో చోరీ చేస్తే ఏం జరుగుతుందో తెలియజేసే.. పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి. దొంగిలించిన వస్తువు విలువకన్నా.. ఏకంగా 30 రెట్లు వసూలు చేస్తారు. ఆ తర్వాత జైలుకు సైతం పంపిస్తారు. అందుకే.. ఆ షాపును ఎంచుకున్నాడు ఫిచిట్.

లోనికి వెళ్లిన వృద్ధుడు.. సిబ్బంది తనను చూసేంత వరకూ ఆగి.. మూడు సబ్బులు తీసుకున్నాడు. వెంటనే సెక్యూరిటీ వాళ్లు వచ్చి పట్టుకున్నారు. చోరీ చేసినందుకు తిట్టిపోశారు. ఇదంతా చూసిన ఓ కస్టమర్ వచ్చి.. "ఆ వృద్ధుడిని వదిలేయండి.. ఆ సబ్బుల ధర నేను చెల్లిస్తాను" అన్నాడు. కానీ.. అందుకు ఫిచిట్ ఒప్పుకోలేదు. తాను చోరీ చేశాను కాబట్టి.. తనను పోలీసులు అరెస్టు చేయాల్సిందేనని అన్నాడు. దీంతో.. అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులు.. ఆ వృద్ధుడి పరిస్థితేంటో అర్థంకాక.. వెళ్లిపొమ్మన్నారు. కానీ.. ఫిచెట్ పట్టు వదలట్లేదు. పోలీసులు రావాల్సిందే.. తనను అరెస్టు చేయాల్సిందేనని భీష్మించాడు. దీంతో.. అనివార్యంగా పోలీసులకు ఫోన్ చేశారు. వారు.. ఘటనా స్థలానికి వచ్చేశారు.

"ఏం జరిగింది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు?" అని పోలీసులు ప్రశ్నించారు. అప్పుడు ఫిచెట్ చెప్పిన మాటలు.. అక్కడున్న వారి హృదయాల్లో ఏ మూలనో సూదిలా గుచ్చినట్టైంది. "నా వయసు 60 ఏళ్లు. కష్టం చేయలేని శరీరం.. ఆకలికి ఆగలేని జానెడు పొట్ట.. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు.. ఈ బాధ నేనెట్టా భరించేది? ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆకలికి మాడిపోయి నేను చచ్చిపోవడం ఖాయం. అదే జైలుకు వెళ్తే.. నాకు మూడు పూటలా తిండి దొరుకుతుంది. అందుకే దొంగతనం చేశాను.. నన్ను అరెస్టు చేయండి" అన్నాడు. ఇది విన్న పోలీసులు.. అక్కడి జనాలు.. మౌనంగా తలలు వాల్చారు. తారస్థాయికి చేరిన ద్రవ్యోల్బణంతో.. థాయిలాండ్ దేశం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక కష్టాలకు.. అక్కడి జనం పడుతున్న అవస్థలకు.. ఫిచెట్ సజీవ సాక్ష్యంగా నిలిచారు!

ఆకలి బాధ.. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. "నువ్వు ఏదైనా తింటావా? లేక నిన్ను తినమంటావా?" అంటుంది ఆకలి. ఓన్లీ వన్ ఛాయిస్! నో.. సెకండ్ ఛాయిస్!! ఎంత దారుణం ఇదీ?! ఒక మనిషి అరవై ఏళ్లపాటు కష్టపడినా.. తినడానికి తిండికూడా లేని దుర్భర స్థితిలో.. జీవితపు ఆఖరి దశను గడపాల్సి రావడం ఎంత ఘోరం? ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. "అన్నింటికీ మందులు కనిపెట్టే సైంటిస్టులు.. ఇలాంటి నిర్భాగ్యుల కోసమైనా.. ఆకలికి సైతం ఓ మందు కనిపెడితే బాగుండేది" అని అనిపించకమానదు!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.