Ganesh immersion 2021 : గణేశ్ నిమజ్జనం వేళ.. నిర్లక్ష్యం వద్దు

author img

By

Published : Sep 19, 2021, 9:25 AM IST

గణేశ్ నిమజ్జనం వేళ.. నిర్లక్ష్యం వద్దు

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు(Ganesh immersion 2021) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నిమజ్జన వేళ జనం ఎక్కువ గుమిగూడే అవకాశమున్నందున ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉండటం వల్ల నిమజ్జన వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మూడో ముప్పు విజృంభించి విలయం సృష్టిస్తుందని హెచ్చరించారు.

గణేశ్ నిమజ్జన శోభాయాత్ర(Ganesh immersion 2021)లో భక్తులు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాకు దూరంగా ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు. జనం ఎక్కువ గుమిగూడిన చోట వైరస్‌ విజృంభించే అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ తరుణంలో ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం గ్రేటర్‌ వ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్రకు భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేశాయి. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది కరోనా కారణంగా గణేశ్ ఉత్సవాల(Ganesh immersion 2021)ను వాయిదా వేశారు. ఎవరి ఇళ్లల్లో వారే జరుపుకొన్నారు. రెండో విడత కరోనా విజృంభించినా... ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అనేక పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో సున్నా కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాక గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో ఇప్పటికే కోటి మందికి చేరువలో టీకా కార్యక్రమం పూర్తి చేశారు. జనం కూడా ధైర్యంగా రహదారులపైకి వస్తున్నారు. అయినా సరే వైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇలా సిద్ధంకండి..

కరోనా ముప్పు
  • ఇప్పటికే గ్రేటర్‌లో 97 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇందులో రెండు డోసుల టీకాలు తీసుకున్న వారు 40 లక్షలు పైనే. అయితే సింగిల్‌ డోసు లేదంటే రెండు డోసులు టీకాలు తీసుకున్న వారు కూడా జాగ్రత్తలు పాటించాలి.
  • వీరంతా ఎన్‌95 మాస్క్‌లు లేదంటే మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌లు ధరించాలి. పిల్లలు కూడా మాస్క్‌లు పెట్టుకునేలా జాగ్రత్తలు చెప్పాలి.
  • వివిధ రకాల ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు...అవయవ మార్పిడి చేయించుకున్నవారు...వృద్ధులు గుంపులకు దూరంగా ఉండటం మేలు. ఇతరులతో పోల్చితే వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వైరస్‌ ఉన్నవారి నుంచి వీరికి సోకే ముప్పు ఉంటుంది.
  • పిల్లల కోసం ఇంటిలోనే కాచి వడబోసిన నీటిని బాటిళ్లలో తెచ్చుకోవడం ఉత్తమం. ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగితే వ్యాధుల బారిన పడే ముప్పు ఉంది. టైపాయిడ్‌, డయేరియా లాంటి వ్యాధులు కల్తీ నీళ్ల ద్వారానే సోకుతాయి.
  • జనంలో ఒకరి చేతులు ఒకరు తాకే అవకాశం ఉంది. చిన్న బాటిల్‌తో శానిటైజర్‌ తెచ్చుకొని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తిని అరికట్టవచ్ఛు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గణేశ్​ నిమజ్జన శోభాయాత్రను విజయవంతం జరుపుకోవచ్చు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.