RAIN EFFECT: తడిసిముద్దయిన రాష్ట్రం.. మత్తడి దూకుతున్న చెరువులు

author img

By

Published : Sep 5, 2021, 10:59 PM IST

Updated : Sep 6, 2021, 11:35 AM IST

heavy rains in telangana

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసిముద్దయింది. హైదరాబాద్​లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులు కోతకు గురై.. గ్రామాల మధ్య రాకపోకలు బంద్​ అయ్యాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్​బీ నగర్​ పరిధిలోని పలు కాలనీలు రెండు రోజుల నుంచి నీటిలోనే ఉన్నాయి. వనస్థలిపురం పరిధిలోని శారద నగర్, శాంతి నగర్ కాలనీ, గాంధీ నగర్, విజయపురి కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. హయత్​నగర్ పరిధిలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మునగనూర్, తొర్రూర్, బంజారా కాలనీ, అంబేడ్కర్​ నగర్, భగత్ సింగ్ కాలనీలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

తడిసిముద్దయిన రాష్ట్రం.. మత్తడి దూకుతున్న చెరువులు

నీట మునిగిన వరి పంట..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్​లో నిన్న కురిసిన భారీ వర్షానికి చింతలచెరువు నిండి విజయవాడ-హైదరాబాద్​ జాతీయ రహదారి మీదగా అలుగు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. చెరువు కింద ఉన్న వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. బాటసింగారం నుంచి మజీద్పూర్‌కి వెళ్లే దారిలోని వాగు, లష్కర్​గూడ వాగులు పొంగిపొర్లుతున్నాయి.

ప్రమాదపు అంచుల్లో ప్రయాణం..

శనివారం.. హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో మూసీ నది పోటెత్తింది. యాదాద్రి జిల్లాలో భీమలింగం వద్ద ఉన్న లోలెవెల్ వంతెనపై నుంచి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంగెం-బొల్లేపల్లి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి-చిట్యాల రోడ్డులో వలిగొండ మండలం కమ్మగూడెం వద్ద రోడ్డుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. భువనగిరి నుంచి నల్గొండకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ప్రమాదపు అంచుల్లో ప్రయాణం చేస్తున్నారు.

వద్దని వారిస్తున్నా.. వాగు దాటేందుకు యత్నించి..

వికారాబాద్ జిల్లా ధారూరు మండలం దోర్నాల వాగులో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు వారిస్తున్నా వినకుండా... ఇద్దరు వ్యక్తులు వాగులో దిగగా... ప్రవాహ వేగానికి పట్టుతప్పి వాగులో కొట్టుకుపోయారు. గట్టుమీద ఉన్న వ్యక్తులు... ఒకరిని కాపాడగా... మరో వ్యక్తి మాత్రం వాగులో గల్లంతయ్యాడు. వాగులో కొట్టుకుపోయిన గోరయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వాగులో ఇప్పటికే నలుగురు గల్లంతై మృత్యువాత పడ్డారు. తాండూరు మండలం బెల్కటూర్‌ గ్రామం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో... గర్భిణీ ఆస్పత్రికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడింది. అంబులెన్స్‌ వచ్చేందుకు వీలు లేకపోవడంతో... ఆమెను రైలు పట్టాలపై నుంచి తోపుడు బండితో 2 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

వ్యక్తి గల్లంతు..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి శివారులోని మామిడి వాగును ద్విచక్రవాహనంతో దాటుతూ వ్యక్తి గల్లంతయ్యాడు. వాగు ఉద్ధృతంగా పారుతోందని వారించినా వినకుండా రేజింతల్ వైపు నుంచి వచ్చి వాగులో కొట్టుకు పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యక్తి గల్లంతు విషయం తెలుసుకున్న హద్నూర్, ఝరాసంగం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమలలోని నార్లాపూర్, ముక్కిడి గుండంలోని పెద్దవాగు, ఉడుముల వాగు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు పొంగి పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎద్దు మృత్యువాత

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. సిద్దిపేట బస్వాపూర్ పోరెడ్డిపల్లి నాగసముద్రాల మీదుగా హనుమకొండకు వాహనాలను దారి మళ్లించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం శంకరాపూర్‌ గ్రామ సమీపంలోని వాగులో ఇద్దరు పిల్లలతో పాటు ఎడ్ల బండి కొట్టుకుపోయింది. స్థానికులు ఇద్దరు పిల్లలను కాపాడగా... ప్రమాదంలో ఒక ఎద్దు మృత్యువాత పడింది. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. దీంతో ఆ దృశ్యం చూపరులను కనువిందు చేస్తోంది.

ఇదీచూడండి: MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే

Last Updated :Sep 6, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.