HEAVY RAIN: అల్పపీడనం కారణంగా చిత్తూరు, నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షం

author img

By

Published : Nov 7, 2021, 5:03 PM IST

HEAVY

అల్పపీడనం కారణంగా ఏపీ చిత్తూరు, నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ నీటమునగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి పడుతున్న వాన కారణంగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు, అండర్ బ్రిడ్జిలు వర్షపు నీటితో నిండిపోయాయి. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. కేవీఆర్ పెట్రోల్ బంక్, గాంధీ బొమ్మ, ట్రంకురోడ్డు, సుబేదారుపేట, సండే మార్కెట్, కాంప్లెక్స్ రోడ్లు వరద నీటితో కాలువలను తలిపించాయి. రహదారులు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని కే వి పురం మండలంలో వరదనీటి ప్రవాహానికి కాళంగి- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై కాజ్ వే కోతకు గురైంది. ఆధారం, కాళంగి, హనుమయ్య కండ్రిగ, కండ్లులూరు, రంగయ్య గుంట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కెవిబిపురం మండలం కాళంగి రిజర్వాయర్​కు పదివేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లును అడుగు మేర ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వరద ప్రవాహం అధికమయితే మరింత ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పారుతున్నాయి. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లోని గ్రామాల మీదుగా కొనసాగే చావాలి వాగు ఉద్ధృతంగా పారుతోంది.

అల్పపీడనం కారణంగా చిత్తూరు, నెల్లూరులో ఎడతెరిపిలేని వర్షం

ఇదీ చూడండి: టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.