అల్లకల్లోలం.. వరద ముంపులో వందల గ్రామాలు

author img

By

Published : Jul 15, 2022, 4:11 AM IST

వరద ముంపులో వందల గ్రామాలు

పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, వంకలు వందలాది గ్రామాల్ని చుట్టుముడుతున్నాయి. కూలిపోతున్న ఇళ్లు, ధ్వంసమవుతున్న రహదారులు, పడిపోతున్న విద్యుత్తు స్తంభాలు, మునిగిన పంటపొలాలు..ఎటు చూసినా తీరని నష్టమే. గోదావరి తీర జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది. భారీ వర్షాలు, సహాయక పునరావాస కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులతో గురువారం సమీక్షించారు.

భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌, పలిమెల, కాటారం మండలాల్లోని 44 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్తు సరఫరా లేక పలిమెల మండలం ఆరు రోజులుగా అంధకారంలో ఉంది. ఈ మండలంలో 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహదేవపూర్‌ మండలం పూసుకుపల్లి గ్రామం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 30 కుటుంబాలను కాళేశ్వరానికి తరలించాయి. కాళేశ్వరం మండలంలోనూ పలు గ్రామాల్లో ఇళ్ల వద్దకు వరద నీరు చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 17 మీటర్లకు పైగా వరద రావడంతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

.
.

పదుల సంఖ్యలో గ్రామాల మునక

  • భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని తొమ్మిది మండలాలను వరద ముంచెత్తింది. 59 గ్రామాలకు చెందిన వారిని 47 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత వారధిని అత్యవసర పరిస్థితుల్లో మూసివేయడం గమనార్హం.
  • నిర్మల్‌ జిల్లా పెంబి మండలం పసుపుల, తాటిగుడా గ్రామాల మధ్య నాలుగేళ్ల కిత్రం నిర్మించిన వంతెన కడెం వాగు ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది.
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 8 మండలాల్లోని 69 గ్రామాల్లో 5,046 మంది ఉండగా అందులో 1856 మందిని 21 పునరావాస కేంద్రాలకు తరలించారు. 259 ఇళ్లు పాక్షికంగా, 10 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
  • కాళేశ్వరం ప్రాజెక్టు సరస్వతి పంప్‌హౌస్‌లోకి నీళ్లు రావడంతో బ్యాక్‌ వాటర్‌తో తొమ్మిది గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
  • పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో అనేక వీధులు జలమయం అయ్యాయి. బొక్కలవాగుకు వరద పెరిగి గోదావరిలో కలిసే క్రమంలో పట్టణంలోకి నీరు చేరింది. గౌతమేశ్వర ఆలయంలో చిక్కుకున్న 23 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. సుమారు 2400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
  • గోదావరిఖనిలోని సింగరేణి పంపుహౌస్‌లో 30 గంటల పాటు చిక్కుకుపోయిన ఉద్యోగులతో పాటు మరో ఇద్దరు జాలర్లను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసుకొచ్చింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కూడా ఆ బృందంతో వెళ్లారు.
    .
    .
  • మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఒడ్డుసోమన్‌పల్లిలో వరదలో చిక్కుకుపోయిన ఇద్దరిని హెలికాప్టర్‌ సహాయంతో రక్షించారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యులను హెలికాప్టర్‌లో పంపించారు.
  • నిజామాబాద్‌ జిల్లాలో 19 గ్రామాలు వరదలకు ప్రభావితం అయ్యాయి. నవీపేట మండలం అల్జాపూర్‌ గ్రామం చుట్టూ వరద నీరుతో దాదాపు దిగ్బంధం అయ్యింది. 14 ఇళ్లు పూర్తిగా, 470 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
  • కరీంనగర్‌ జిల్లాలో 42 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 249 మందిని తరలించారు. ఎస్సీ కాలనీ, కిష్టయ్యపల్లిలకు చెందిన 200మందిని గంగాధర కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. నగునూర్‌ శివారులో వాగుమధ్యలో చిక్కుకున్న 9 మంది ఇటుకబట్టీ కార్మికులను అధికార యంత్రాంగం సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. వారిని వెలుపలికి తీసుకొచ్చేంత వరకు మంత్రి గంగుల కమలాకర్‌ అక్కడే ఉండి సహాయక చర్యల్ని పరిశీలించారు.
  • జగిత్యాల జిల్లాలో 2,132 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బీర్పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్‌ పాత కట్ట తెగిపోయింది. దీని దిగువనే ఉన్న మరో అరగుండాల ప్రాజెక్ట్‌ వద్ద ఉన్న కట్ట కూడా నీటి తాకిడికి వరదల్లో కొట్టుకుపోయింది. సమీపంలోని గ్రామాల్లోని 2 వేల ఎకరాల్లోని పంటభూముల్లో ఇసుకమేట వేసింది.
  • మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు 16 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
.
.

నలుగురి మృతి; ఒకరి గల్లంతు: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధి బీరప్పబస్తీలో గురువారం వర్షాలకు అద్దె ఇంటి గోడ కూలి కోల్‌కతాకు చెందిన వలస కూలీ సూర్జకాంత మరణించారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో ఇంటి మట్టిగోడ కూలి బుధవారం రాత్రి రాజమణి (45) అనే వివాహిత మృతి చెందారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నిజామాబాద్‌ పట్టణ శివారులో కాలూరు-ఖానాపూర్‌ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు వరదలో బాబన్న అనే వ్యక్తి కొట్టుకుపోయారు. ఒక రైసుమిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన సైకిల్‌పై వస్తూ గల్లంతయ్యారు.

గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది దుర్మరణం: వరద సహాయక చర్యలు అందించేందుకు వెళ్లిన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ సిబ్బంది దుర్మరణం చెందారు. కుమురం భీం జిల్లా దహెగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో.. ఆరుగురు సభ్యులతో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లింది. మల్లన్న వాగులో చిక్కుకున్న ఓ గర్భిణిని రక్షించే క్రమంలో శ్రీరాంపూర్‌కు చెందిన చిలుక సతీష్‌ (36), రామకృష్ణాపూర్‌కు చెందిన అంబాల రాములు (26)లు బుధవారం నీటిలో గల్లంతయ్యారు. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం బీబ్రా సమీపంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. లైఫ్‌ జాకెట్లు వేసుకోకుండా నీటిలో దిగిన వారు వాగు భౌగోళిక పరిస్థితులు అర్థంకాక నీటిలో చిక్కుకొని మరణించారు. సహాయం అందించేందుకు వెళ్లిన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి చెందడం కార్మికులను కలచివేసింది.

.
.

ఆవాసాలకు నిలిచిన తాగునీటి సరఫరా: భారీవర్షాలతో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం పెరగడం, ఇన్‌టేక్‌వెల్స్‌, విద్యుత్తు సబ్‌స్టేషన్లు మునిగిపోవడం, పైపులైన్లు కొట్టుకుపోవడంతో ఏడు జిల్లాల పరిధిలోని 2,222 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో చేతిపంపులు, బోరుబావులే ప్రజలకు దిక్కయ్యాయి. ఆసిఫాబాద్‌ మిషన్‌ భగీరథ సెగ్మెంట్‌ పరిధిలో అత్యధికంగా 1596 ఆవాసాలకు సరఫరా నిలిచిపోయింది. కుమురం భీం రిజర్వాయరులోకి వరద ఒక్కసారిగా పెరిగి.. ఇన్‌టేక్‌వెల్‌ను బురద ముంచెత్తింది. సిబ్బంది గృహాలు నీటమునిగాయి. ముత్తుగూడ పైపులైను పగిలిపోయింది. నిర్మల్‌లోని కడెం రిజర్వాయరు పొంగిపొర్లడంతో ఇన్‌టేక్‌వెల్‌, సబ్‌స్టేషన్‌ వరదలో మునిగిపోయాయి. దీంతో దాదాపు 350 ఆవాసాలకు తాగునీరు బంద్‌ అయ్యింది. పూసూరు ఇన్‌టేక్‌వెల్‌దీ ఇదే పరిస్థితి. ఎల్లంపల్లి - మంచిర్యాల సెగ్మెంట్‌లో పైపులైను కొట్టుకుపోయింది. మంథని-భూపాలపల్లి సెగ్మెంట్‌లో పైపులైను ధ్వంసమైంది. నల్గొండ జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. పైపులైను దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ‘వరద తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేలా మండలానికి ఇద్దరు చొప్పున అధికారులకు బాధ్యతలు అప్పగించాం. మిషన్‌ భగీరథలో ఎక్కడా మోటార్లు నీట మునగలేదు. అందువల్ల పునరుద్ధరణ చర్యలు వేగంగా పూర్తయ్యే అవకాశముంది’ అని మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు.

పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు: భారీ వర్షాలతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, జగిత్యాల, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీగా రహదారులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ మార్గంలో ములుగు వద్ద సుమారు 30 శాతం జాతీయ రహదారి నీట మునిగింది.

జాతీయ రహదారుల్లో 19 ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడగా.. 14 ప్రాంతాల్లో గురువారం సాయంత్రానికి రాకపోకలు పునరుద్ధరించారు. మిగిలిన చోట్ల మరో 24 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర రహదారుల్లో 38 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 12 ప్రాంతాల్లో, జగిత్యాలలో తొమ్మిది, భూపాలపల్లిలో అయిదు, నిర్మల్‌, ఆదిలాబాద్‌లలో మూడేసి ప్రాంతాలు, నిజామాబాద్‌లో రెండు చోట్ల, కరీంనగర్‌, భద్రాది-కొత్తగూడెం, మేడ్చల్‌-మల్కాజిగిరిలలో ఒక్కో ప్రాంతంలో రహదారులు కొట్టుకుపోవటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ఆదిలాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌లలో మాత్రమే ట్రాఫిక్‌ను పునరుద్ధరించగలిగినట్లు సమాచారం.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.