ఛార్జీలు పెంచినా... ఆర్థిక సంక్షోభంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు

author img

By

Published : Apr 24, 2022, 11:43 AM IST

financial crisis

Electricity Companies in Financial Crisis: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీలో ఆధిక ధరలకు కొనాల్సి రావడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర డిస్కంలు నెలలో రూ.2,200 కోట్లు వెచ్చించాయి. ఐఈఎక్స్‌గా వ్యవహరించే ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌కు గత ఐదురోజులుగా రోజుకు సగటున రూ.60 కోట్ల వరకూ చెల్లించి 5 కోట్ల యూనిట్ల వరకూ కొంటున్నాయి. ఈ నెల 1 నుంచి ఛార్జీలు పెంచినా డిస్కంలలో ఆర్థిక అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి.

Electricity Companies in Financial Crisis: ఇంధన ఎక్స్ఛేంజీలో ప్రతిరోజూ అధిక ధరలకు కరెంటు కొనాల్సి రావడంతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత నెల 1 నుంచి ఇప్పటివరకూ రూ.2,200 కోట్ల వరకూ వెచ్చించాయి. ఈ నెలాఖరునాటికి మరో రూ.400 కోట్ల వరకైనా ఖర్చుచేసి కరెంటు కొనాల్సి రావచ్చని అంచనా. ఐఈఎక్స్‌గా వ్యవహరించే ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌కు గత ఐదురోజులుగా రోజుకు సగటున రూ.60 కోట్ల వరకూ చెల్లించి 5 కోట్ల యూనిట్ల వరకూ కొంటున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 1న అత్యధికంగా 27.40 కోట్ల యూనిట్ల వాడకం నమోదైంది. 21న కనిష్ఠంగా 23 కోట్లు వినియోగించారు.

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ సంవత్సరం మార్చి 29న గరిష్ఠంగా 28 కోట్ల యూనిట్లు వాడారు. ఈ పరిస్థితుల్లో ఏరోజుకారోజు ఐఈఎక్స్‌లో కొని ప్రజలకు సరఫరా చేయాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా పలు థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి తక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ డిమాండు పెరగడంతో ఎక్స్ఛేంజీలో పోటాపోటీగా కొంటున్నందున గరిష్ఠ ధర రూ.12 చెల్లిస్తామన్నా ఒక్కోరోజు కొన్ని రాష్ట్రాలకు కరెంటు దొరకడంలేదు. కొద్దిరోజుల క్రితం వరకు యూనిట్‌ గరిష్ఠ ధర రూ.20 పలికింది. డిస్కంల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి యూనిట్‌ గరిష్ఠ ధర రూ.12కి మించరాదని నిబంధన పెట్టింది.

ఛార్జీలు పెంచినా అవస్థలే... కరెంటు ఛార్జీలను ఈ నెల 1 నుంచే డిస్కంలు పెంచాయి. వచ్చే నెల రెండో వారం తరవాతే వాటికి ఈ ఆదాయం వస్తుంది. ఈలోగా నిధులు సర్దుబాటు చేయడానికి తంటాలు పడుతున్నాయి. గత నెలలో ఆర్థిక సంవత్సరం చివరన బిల్లులు అధికంగా చెల్లించాల్సి రావడం, అధిక ధరలకు కరెంటు కొన్నందున ఏప్రిల్‌ 8 వరకూ ఉద్యోగులకు విద్యుత్‌ సంస్థలు జీతాలు చెల్లించలేకపోయాయి. ఈ నెల కూడా కరెంటు కొనుగోలు అధికంగా ఉన్నందున మే ఒకటికల్లా జీతాలు చెల్లించడం ఎలా అని అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.875 కోట్లను రాయితీ పద్దు కింద డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అదనంగా మరో రూ.3 వేల కోట్లు ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయి. రూ.వెయ్యి కోట్లను బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

వరి సాగు కాలం పెరగడంతో... ఈ యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట కోతలు ఇంకా పూర్తికానందున కరెంటు డిమాండు తగ్గడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది. సాధారణంగా యాసంగి వరి సాగు నవంబరులో మొదలై మార్చితో ముగియాలి. కానీ గత జనవరి, ఫిబ్రవరి దాకా నాట్లు వేసినందున కొన్ని ప్రాంతాల్లో కోతలు పూర్తికాలేదు. రాష్ట్రంలో మొత్తం 25.40 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు వినియోగం అధికంగానే ఉంటోంది. దీనికితోడు ఉక్కపోతలతో ఇళ్లకు సైతం విద్యుత్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉంటోంది. ‘‘వివిధ రాష్ట్రాలు అధిక ధరలకు కొనలేక కరెంటు కోతలు విధిస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి కచ్చితంగా 24 గంటలూ నిరంతర సరఫరా చేయాల్సిందేనని ఆదేశించడంతో అధిక ధరలకైనా కొని సరఫరా చేస్తున్నాం’’ అని డిస్కంల వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:Prashant Kishor News: సీఎం కేసీఆర్​తో ప్రశాంత్ కిశోర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.