దసరాకు ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే పరేషాన్​ తప్పదు..!

author img

By

Published : Sep 2, 2022, 6:53 AM IST

Dussehra festival

దసరా పండగకు ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నారా.. అయితే కష్టమే! ఎందుకు అని ఆలోచిస్తున్నారా.. ఇప్పటి నుంచే రైళ్లలో ప్రయాణించేవారు రిజర్వేషన్లు దొరకక అవస్థలు పడుతున్నారు. అసలు టికెట్​ దొరకడమే గగనమైపోయింది. వెయిటింగ్​ లిస్ట్​ ప్రతి రైలుకీ కొండంత ఉంది. పేద ప్రజలకు ఈ విషయం గుదిబండలా మారనుంది. రాష్ట్ర ప్రజల కోసమే తీసుకొని వచ్చారు అని చెప్పిన జనసాధారణ్​, ప్రత్యేక రైళ్ల జాడే లేదు. దీంతో ఈసారి దసరాకు ఇంటికి వెళ్లాలంటే పరేషాన్ తప్పేలా లేదు.

దసరా పండగకు నెల రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ.. రైళ్లలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్లు దొరకడం గగనమైపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో సీట్లు, బెర్తులు దాదాపుగా అయిపోయాయి. కొన్ని రైళ్లలో నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్టు) టికెట్ల పరిమితి దాటిపోయింది. అక్కడక్కడ ఏసీ రైళ్లకు, డైనమిక్‌ ఛార్జీల విధానంలోను టికెట్లు ఉన్నప్పటికీ సామాన్యులు, పేదలు కొనలేని పరిస్థితి ఉంది.

అక్టోబరు 1 నుంచే రద్దీ.. అక్టోబరు 5న దసరా.. 1వ తేదీ శనివారం కావడంతో ఆరోజు సాయంత్రం నుంచే చాలామంది ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైల్వే జోన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో రద్దీకి తగ్గట్లు ప్రత్యేక రైళ్లు నడిపించలేని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు పండగ ప్రయాణానికి ఒకటి, రెండు రోజుల ముందు కొంతమేర ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. హైదరాబాద్‌ నుంచి అక్టోబరు 1న బయల్దేరే రైళ్లలో దాదాపుగా రిజర్వేషన్లు అయిపోయాయి. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌, గోదావరి, గరీబ్‌రథ్‌, ఎల్‌టీటీ కురుక్షేత్ర, గౌతమి, దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఒక్కో దాంట్లో వందల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ పరిమితి దాటిపోయింది. ఈ తేదీల్లో అక్టోబరు 2-4 వరకు విశాఖపట్నం వెళ్లే దురంతో, గరీబ్‌రథ్‌ వంటి ఏసీ రైళ్లలో మాత్రమే కొద్దిమేర టికెట్లున్నాయి. బెంగళూరు నుంచి విజయవాడ వైపు అక్టోబరు 1న ప్రశాంతి, కొండవీడు, గరీబ్‌రథ్‌, సంఘమిత్ర సహా ఎనిమిది రైళ్లుంటే.. ఏ ఒక్క బండిలోనూ ఖాళీల్లేవు. ఒక్కో రైలులో వందల్లో నిరీక్షణ జాబితా ఉంది. ఒక్క ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే 606 వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. యశ్వంత్‌పుర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌లో నిరీక్షణ జాబితా 428కి చేరింది. త్రీటైర్‌, టూటైర్‌ ఏసీల్లోనూ నిరీక్షణ పరిమితి దాటిపోయింది.

వలస కార్మికుల కష్టాలు.. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వలస కార్మికులు హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. తెలంగాణకు చెందినవాళ్లు ముంబయి, భీవండి వంటి చోట్ల.. ఏపీ వాసులు బెంగళూరు వంటి చోట్ల ఎక్కువగా ఉన్నారు. వీరంతా దసరాకి సొంతూళ్లకు వెళ్లేందుకు రైళ్లలో రిజర్వేషన్‌ దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిహార్‌ కార్మికులు తమ ఆర్థికశక్తికి మించి అధిక ఛార్జీలు ఉండే త్రీటైర్‌, టూటైర్‌ ఏసీల్లో టికెట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నా అవీ దొరకడం లేదు.

జాడలేని జన్‌సాధారణ్‌ రైళ్లు.. రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మిర్యాలగూడ, కొత్తగూడెం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, కాగజ్‌నగర్‌ వంటి పట్టణాలకు భారీగా వెళతారు. అన్ని జనరల్‌ బోగీలు ఉండే జనసాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైళ్లను నడిపితే ఉపయోగం ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.