కాలేజీలు తెరిచారు.. కానీ పాఠ్యపుస్తకాలేవీ!

author img

By

Published : Jun 24, 2022, 6:24 AM IST

inter text books printing

Delay in Inter Text Books Printing : ఇంటర్​ కళాశాలలు తెరిచినా పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోటవం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠ్యపుస్తకాలను ముద్రించి సకాలంలో మార్కెట్లోకి తీసుకురావడంలో ఈసారి తెలుగు అకాడమీ అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Delay in Inter Text Books Printing :ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను ముద్రించి సకాలంలో మార్కెట్లోకి తీసుకురావడంలో ఈసారి తెలుగు అకాడమీ అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ముద్రణకు టెండర్‌ను పిలవడం నుంచి ప్రింటింగ్‌ ఛార్జీల ఖరారు వరకు సత్వర నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబించింది.. కిందిస్థాయి అధికారులు దస్త్రాలు పంపినా ఉన్నతాధికారి పట్టించుకోలేదు. దీంతో కళాశాలల్లో తరగతులు మొదలైనా ఇప్పటివరకు పుస్తకాలు లేకుండా పోయాయి. ఫలితంగా లక్షలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుగు అకాడమీ, పుస్తక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.

విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పాఠ్యపుస్తకాలను ముద్రించి మార్కెట్లో ఉంచేందుకు ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే కాగితం కొనుగోలుకు టెండర్లు పిలుస్తారు. ఈసారి కాగితం ధరలు పెరగడంతో వాటి ధరలను నిర్ణయించడంలో తెలుగు అకాడమీ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల చివరకు పోటీపరీక్షల పుస్తకాలకూ ఏప్రిల్‌, మే మాసాల్లో తీవ్ర కొరత వచ్చిన సంగతి తెలిసిందే. టెండర్‌ తీసుకున్న సంస్థల నుంచి కాగితం రాలేదని అప్పట్లో సాకు చెప్పారు. ఆ పేపర్‌ వచ్చి నెలవుతున్నా నేటికీ ఇంటర్‌ పుస్తకాల ముద్రణే మొదలు కాకపోవడం గమనార్హం.

ముద్రణ ఛార్జీలను 12 ఏళ్లుగా పెంచలేదని, ఈసారి పాత ధరలతో ముద్రించలేమని, వాటిని పెంచాలని ఆఫ్‌సెట్‌ ప్రింటర్లు విద్యాశాఖకు మొరపెట్టుకున్నారు. ఈక్రమంలో తెలుగు అకాడమీ టెండర్లు పిలవగా సుమారు 50మంది ముందుకొచ్చారు. ముద్రణ ధరలపై ప్రింటర్లు, అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయి. మొత్తానికి ప్రింటింగ్‌ కమిటీ సభ్యులు కలర్‌కు 15 శాతం, బ్లాక్‌ అండ్‌ వైట్‌కు 80 శాతం పెంపునకు అంగీకరించి, తుది నిర్ణయం కమిటీ ఛైర్మన్‌ అయిన అకాడమీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ శ్రీదేవసేన తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. నెల రోజులవుతున్నా ఆమె దానిపై నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నారు. వేగంగా నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికల్లా మార్కెట్లో పుస్తకాలు ఉండేవి. ఈసారి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి.. దస్త్రాలపై సంతకాల కోసం అకాడమీ సిబ్బంది అర్ధరాత్రి వరకు ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని తెలిసింది.

ఇప్పటికిప్పుడు ముద్రణ ఛార్జీలపై నిర్ణయం తీసుకున్నా పుస్తకాలు మార్కెట్లోకి వచ్చేందుకు మరో 20 రోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా విద్యార్థులు పుస్తకాలు కొనరని వాటిని ముద్రించలేదన్నారు. ఫలితంగా మార్కెట్లో పాత పుస్తకాలు లభించక ఇపుడు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోందని తెలిపారు. మరోవైపు ఇప్పటివరకు ఉన్న పేజీ ధరను 30 నుంచి 55 పైసలకు పెంచడం వల్ల ఈసారి పుస్తకాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇంటర్‌ (ద్వితీయ) ఎంఈసీ ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు కావాలని అకాడమీలో అడిగితే ఆర్థికశాస్త్రం పుస్తకం మాత్రమే ఉందని చెబుతున్నారని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు.

ఉచిత పుస్తకాలూ ఆలస్యం: రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తొమ్మిది లక్షల మంది ఉంటారు. వారిలో దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. వారికి ఇంటర్‌ విద్యాశాఖ ఉచితంగా పుస్తకాలను అందిస్తోంది. తమ విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని, అవసరమైన నిధులు చెల్లిస్తామని తెలుగు అకాడమీకి లేఖ రాసింది. పుస్తకాల ముద్రణే ప్రారంభం కానందున వారికి కూడా ఇప్పట్లో అవి అందే అవకాశం లేదు. ఇంటర్‌ పుస్తకాల కొరత, ముద్రణ ఛార్జీల ఖరారు విషయమై అకాడమీ అధికారి ఒకరిని ప్రశ్నించగా.. ఆ విషయం పరిశీలనలో ఉందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.