ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?

author img

By

Published : Sep 9, 2022, 5:34 PM IST

ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?

"పందులకేం తెల్సు పాండ్స్ పౌడర్ వాసన?" ఇదో సినిమా డైలాగ్. ఈ స్టోరీ చదివాక.. ఈ డైలాగ్ రాంగ్ అని తప్పక అనిపిస్తుంది! అవును మరి.. ఫైవ్​ స్టార్ ఫెసిలిటీస్​తో.. రాజభోగాలు అనుభవిస్తున్నాయక్కడ!! వరాహాల కోసం ఏకంగా 26 అంతస్థుల "పిగ్ హోటల్" నిర్మించారు.. విత్ ఎయిర్ కండీషన్!!!

పిగ్​ హోటల్​
పిగ్​ హోటల్​

ఈ బిల్డింగ్ చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏదో బడా కార్పొరేట్ కంపెనీ బిల్డింగ్ అనిపిస్తుంది కదా! లేదంటే.. సింగపూర్ లాంటి దేశంలోని లగ్జరీ హోటల్ అనుకుంటారు.. అంతే కదా?! కానీ.. కాదు. ఇవేకాదు.. మీరు అనుకునే ఏదీ కూడా కాదు! గుండె దిటవు చేసుకొని వినండి.. ఇదొక పందుల దొడ్డి! "ఏం మాట్లాడుతున్నావ్ సామీ.. నరాలు కట్టైపోయినయ్" అంటారా? పందులకు గట్లా కలిసిసొచ్చింది మరి..! అసలింతకీ.. పందులకు ఈ రాజభోగం ఏందీ? ఎవరు కట్టారు ఇంత పెద్ద భవనం.. ఎక్కడుంది? దేనికోసం ఇదంతా..? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు
పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు

ఈ భారీ పందుల భవనాన్ని "పిగ్ హోటల్" అని పిలుస్తున్నారు. కరోనా పుట్టినిల్లు చైనాలో ఉంది. హుబే ప్రావిన్స్​లోని ఎజౌ నగరంలో ఉందీ పందుల హోటల్. ఇంత పెద్ద పిగ్ ఫామ్.. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. యూరప్​లోని పలు దేశాల్లో ఉన్నాయి గానీ.. ఆ బిల్డింగులు మూడంటే మూడు అంతస్థులకు మించలేదు. కానీ.. చైనాలోని ఈ భవనం పందుల పెంపకందారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఆకాశం వైపు పరుగులు పెట్టింది! ఈ భవనంలో మొత్తం 26 అంతస్థులు ఉన్నాయి.

పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు
పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు

ఒక్కో అంతస్థులో.. పది వేల పందులను పెంచేందుకు వీలుగా నిర్మించారు. 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం కట్టారు. ఇక, ఇందులోని టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే. సాధారణ పశువుల పాకలు, పందుల దొడ్లకు భిన్నంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఏర్పాట్లు చేశారు. ఇందులో.. ఆటోమేటెడ్ ఫీడింగ్ మెషీన్లు ఉంటాయి. అంటే.. ప్రత్యేకంగా పందులకు మేత వేయాల్సిన పనిలేదు. అవును మరి.. ఒక్క అంతస్థులోనే 10 వేల పందులు ఉంటే.. 26 అంతస్థుల్లో ఉన్నవాటికి ఎంత మంది పనివాళ్లు కావాలి? అందుకే.. ఆటోమేటెడ్ ఫీడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనికితోడు స్మార్ట్ ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఇన్​ఫెక్షన్లు సోకకుండా క్రిమి సంహారక వ్యవస్థలు కూడా ఉన్నాయిందులో. పందుల వ్యర్థాలను శుద్ధి చేసేందుకు.. బయోగ్యాస్ ఆధారిత వ్యర్థాల శుద్ధి కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. రీసైక్లింగ్ ద్వారా.. విద్యుత్ ఉత్పత్తి కూడా చేపట్టనుండటం విశేషం. మొత్తంగా.. ఈ పిగ్ హోటల్ నుంచి సంవత్సరానికి 54 వేల టన్నుల పంది మాంసం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు
పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు

ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి ఫామ్స్ ఉన్నప్పటికీ.. అవి చాలా చిన్నవి. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు రన్ అవుతున్నాయి. సామూహికంగా గదుల్లో పెంచిన పంది మాంసాన్ని తినడానికి జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే.. యూరప్​లో ఇలాంటి ఫామ్స్ మూతపడ్డాయి. కానీ.. అందుకు భిన్నంగా చైనా భారీ పిగ్ హోటల్ నిర్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. ఈ స్థాయిలో పందులను పెంచడం గతంలో చైనాలో ఎన్నడూ లేదు. గడిచిన మూడేళ్లుగానే.. ఈ బిజినెస్ ఊహించని స్థాయిలో ఊపందుకుంది. చైనాలోని రైతులు బిలియన్ల డాలర్ల కొద్దీ డబ్బును.. ఇలాంటి పిగ్ హోటళ్లలో పెట్టుబడిగా పెడుతున్నారు.

పిగ్ హోటల్స్
పిగ్ హోటల్స్

మరి, ఎందుకు ఇంత భారీగా పందులను పెంచుతున్నారు? అంటే.. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కొట్టిన దెబ్బ అలాంటిది మరి..! అవును.. చైనాలో పుట్టినట్టుగా చెబుతున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మనుషులను చంపేస్తే.. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ, చైనాలోని పందులపై విరుచుకుపడింది. ఈ వైరస్ ఎంతలా దెబ్బ కొట్టిందంటే.. మాంసాహారులకు పంది మాంసమే దొరకకుండాపోయింది. డిమాండ్, సప్లైలో చాలా తేడా వచ్చేసింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ఆ ఫలితంగానే.. ఇలాంటి భారీ పిగ్ హోటల్స్ చైనాలోని చాలా ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. నిజానికి.. 2019 ముందు వరకు, చైనాలో ఇలా బహుళ అంతస్థుల్లో.. పిగ్ ఫామ్స్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కానీ.. అవసరం ఏమైనా చేయిస్తుంది కదా! ఇలా.. చట్టాన్నే ఎత్తేయించింది.

పిగ్ హోటల్స్
పిగ్ హోటల్స్

అయితే.. ఇలాంటి పిగ్ ఫామ్స్ ఏర్పాటు చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. లక్షలాదిగా పందులను గదుల్లో కుక్కేసి.. వాటిని స్వేచ్ఛను హరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు.. బయటి వాతావరణం తాకకుండా.. గదుల్లో పెరిగిన పంది మాంసంలో క్వాలిటీని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చోట ఏదైనా వైరస్ ప్రబలితే ఏంటనే ఆందోళ కూడా ఉంది. ఇలాంటి వాటిని నియంత్రించడం కూడా కష్టమవుతుందని చైనాలోని న్యూ హోప్ గ్రూప్ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ జెంగ్ జిచెంగ్ అన్నారు.

పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు
పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు

అయితే.. నిర్వాహకులు మాత్రం ఇలాంటి ఫామ్స్ వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో పందులను పెంచడానికి చాలా భూమి కావాల్సి వస్తుందని, వాటితో పోలిస్తే.. ఈ పిగ్ హోటల్స్ చాలా భూమిని మిగిలిస్తాయని చెబుతున్నారు. ఈ భవనాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని.. ఇవి పర్యావరణానికి మేలు చేయడంతో పాటు వనరులను ఆదా చేస్తాయని.. ఒక పిగ్ హోటల్ పెట్టుబడి పెట్టిన వ్యక్తి చెప్పాడు.

పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు
పిగ్ హోటల్స్ లోని పంది పిల్లలు

మొత్తానికి.. ఎక్కడా లేని విధంగా చైనాలో పిగ్ ఫామింగ్ సాగుతోంది. అది ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్​కు ఎదిగింది. ఇప్పుడు, నిర్వహణే సవాల్. ఈ విపరీత ధోరణి కారణంగా.. మరో మహమ్మారి పుట్టుకు రాకుండా చూడాల్సిన బాధ్యత ఆ దేశానిదే. అదే ప్రపంచానికి పది వేలు..!

ఇవీ చూడండి..

మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!

అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.