"ఛీ.. ఛీ.. ఏందిరా ఈ ఛండాలమూ..?" ఉద్యోగుల టాయిలెట్లో.. సీసీ కెమెరాలు!

author img

By

Published : Sep 20, 2022, 3:38 PM IST

cctv

టాయిలెట్ లోకి ఎక్కువ సేపు వెళ్తున్నారంటూ.. మొదటగా వాష్ రూమ్ లో టైమర్ బిగించారు. ఆ తర్వాత గడువు దాటిన వారికి ఫైన్ వేసే రూల్ పెట్టారు. మరికొంత కాలం తర్వాత జీతంలో కోతలు విధించడం మొదలు పెట్టారు.. ఇప్పుడు లేటెస్ట్ గా అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారు! ఏకంగా టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు బిగించారు!! ఈ విషయం విన్న వారంతా.. "ఇది మానవ హక్కులను హరించడమే కాదు.. అంతకు మించిన బరితెగింపు" అని విమర్శిస్తున్నారు.

గంటలు గంటలు కేఫ్ లో కూర్చొని.. బాతాఖానీ కొడుతూ.. ఉద్యోగులు టైం వేస్ట్ చేస్తున్నారంటూ.. కంపెనీ "టైమ్" పెట్టిందంటే.. ఓకే అనుకోవచ్చు. ఆఫీస్ కు సమయానికి రావట్లేదు కాబట్టి.. జీతంలో కోతలు విధిస్తున్నారంటే.. అంగీకరించొచ్చు. కానీ.. టాయిలెట్లోకి వెళ్లి, ఇన్ టైమ్ లో పని ముగించుకొని రావట్లేదంటూ.. ఉద్యోగులపై చర్యలు తీసుకున్న కంపెనీ గురించి మీరెప్పుడైనా విన్నారా? బాత్ రూమ్ డోర్ కు టైమర్ బిగించిన ఆఫీసులను మీరెక్కడైనా చూశారా? పే స్లిప్ లో.. "వాష్ రూమ్ లేట్" అనే కాలమ్ పెట్టి.. జీతాలు తెగ్గోసిన యాజమాన్యాలు ఎక్కడైనా కనిపించాయా? కానీ.. అక్కడ మాత్రం.. ఏకంగా టాయిలెట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు లోనికి వెళ్లింది మొదలు.. పని ముగించుకొని బయటకు వచ్చేంత వరకూ.. ప్రతీ సెకన్ ఏం చేశారన్నది రికార్డు చేస్తున్నారు!!

మానవ హక్కుల గురించి.. కార్మికుల శ్రేయస్సు గురించి నిత్యం మాట్లాడే కమ్యూనిస్టు దేశం చైనాలో జరుగుతున్న దారుణమిది! ఏదో ఒక్క కంపెనీ కాదు.. అక్కడ చాలా కంపెనీలు ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తున్నాయి. దీంతో.. కార్మికులను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ చాలా కంపెనీలు వాష్ రూమ్ లో టైమర్లు పెడితే.. ఇప్పుడు ఏకంగా సీసీ కెమెరాలు బిగించింది ఓ సంస్థ. అది కూడా ఏ ప్రైవేటు కంపెనీయో కాదు.. సాక్షాత్తూ ప్రభుత్వ యాజమాన్య సంస్థలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జియామెన్‌లో ఉన్న "చైనా ఏవియేషన్ లిథియం బ్యాటరీ టెక్నాలజీ కో., లిమిటెడ్" సంస్థలో ఈ నిర్వాకం వెలుగు చూసింది. ఉద్యోగులు టాయిలెట్లో కూర్చున్న ఫొటోలు లీకయ్యాయి. అవి.. చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో.. అన్ని వర్గాల నుంచీ తీవ్రస్థాయిలో విర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. చైనా మీడియా సంస్థలు ఆ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో.. అనివార్యంగా సంస్థ స్పందించాల్సి వచ్చింది. ఆ లీక్ అయిన ఫొటోలు తమ కంపెనీ నిఘా వ్యవస్థ నుంచే రికార్డ్ అయ్యాయని అంగీకరించింది. అయితే.. టాయిలెట్లో సిగరెట్ తాగకుండా.. ఫోన్ చూడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే.. సీసీ కెమెరాలు పెట్టామని సమర్థించుకోవడం గమనార్హం.

సీసీ కెమెరా దృశ్యాలు
సీసీ కెమెరా దృశ్యాలు

కానీ.. నెటిజన్లు ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎన్ని కారణాలు చెప్పినా.. టాయిలెట్లో సీసీ కెమెరాలు పెట్టడాన్ని సమర్థించుకోలేరని మండిపడుతున్నారు. ఇది నిస్సందేహంగా.. వ్యక్తి స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని చంపేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని లేబర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. న్యాయ నిపుణులు స్పందిస్తూ.. సదరు కంపెనీ ఖచ్చింతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. ఆఫీసులో టాయిలెట్ కు వెళ్లడం అనే విషయమై.. కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు చైనాలో కొంతకాలంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. టాయిలెట్‌లోకి ఎక్కువ సమయం వెళ్తున్నారంటూ టైమర్లు బిగించడం.. ఉద్యోగుల జీతాలు కట్ చేయడం.. ఫైన్ వేయడం.. అక్కడ సాధారణంగా మారింది. రోజులో ఒక్కసారికి మించి టాయిలెట్‌ వెళ్లొద్దని చెప్పే కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ చర్యలపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు ఏకంగా.. ప్రభుత్వానికి చెందిన సంస్థ టాయిలెట్లో సీసీ కెమెరాలు పెట్టడంతో ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.