ఎన్జీవోల అనుమతులకు అడ్డదారులపై సీబీ‘ఐ’

ఎన్జీవోల అనుమతులకు అడ్డదారులపై సీబీ‘ఐ’
CBI focus on NGOs Permissions : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలు పాటించకుండా అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్న ఎన్జీవోల వ్యవహారంపై సీబీఐ కొరడా ఝళిపిస్తోంది. వీటికి సహకరిస్తోన్న ఇంటి దొంగలపైనా ఓ కన్నువేసింది.
CBI focus on NGOs Permissions : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనల్ని పాటించకుండా స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో)ను కొనసాగించేందుకు అడ్డదారిన అనుమతుల్ని పొందుతున్న వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. ఈ ఎన్జీవోలకు సహకరించిన ఇంటిదొంగలపైనా కొరడా ఝళిపిస్తోంది.
దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, మణిపుర్ తదితర రాష్ట్రాల్లోని దాదాపు 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. 14 మంది నిర్వాహకులు, దళారులతోపాటు ఎఫ్సీఆర్ఏ కార్యాలయ అధికారులు ఆరుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో సికింద్రాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ ఉన్నారు. నిందితుల నుంచి రూ.3.21 కోట్ల నగదుతోపాటు కీలక పత్రాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం 36 మంది నిందితులతోపాటు ఏడుగురు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బుధవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
- ఇదీ చదవండి : టమాటా ఫ్లూ కలకలం.. ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు!
స్వచ్ఛంద సంస్థ అనుమతి కోసం తమిళనాడులోని అవడిలో రూ.4 లక్షల లంచం ఇస్తున్న నిర్వాహకుడితోపాటు తీసుకుంటున్న ఉద్యోగిని సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిల్లీ ఎఫ్సీఆర్ఐ కార్యాలయంలోని సీనియర్ అకౌంటెంట్ అధికారి తరఫున అవడిలోని ఉద్యోగి ఈ లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ సొమ్మును హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించారు.
