CJI Justice NV Ramana: జడ్జిలపై దాడులను అందరూ ప్రశ్నించాలి: సీజేఐ జస్టిస్​ ఎన్​.వి రమణ

author img

By

Published : Dec 26, 2021, 8:33 PM IST

CJI Justice NV Ramana: జడ్జిలపై దాడులను అందరూ ప్రశ్నించాలి: సీజేఐ జస్టిస్​ ఎన్​.వి రమణ

CJI Justice NV Ramana: బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ.. సొంత రాష్ట్రంలో దక్కిన ఆదరణ తన మనసును కదిలించిందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండటం తనకు గర్వకారణమని చెప్పారు. ఇక్కడి గాలి పీల్చి.. కృష్ణా నది నీళ్లు తాగే ఈ స్థాయికి చేరానని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న సీజేఐ.. జడ్జిలపై దాడులను అందరూ ప్రశ్నించాలని కోరారు.

CJI Justice NV Ramana: జడ్జిలపై దాడులను అందరూ ప్రశ్నించాలి: సీజేఐ జస్టిస్​ ఎన్​.వి రమణ

CJI Justice NV Ramana: బెజవాడ బార్ అసోసియేషన్‌లోనే తన తొలి అడుగులు పడ్డాయని సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ చెప్పారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండటం తనకు గర్వకారణమని అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్‌కు చాలా ప్రత్యేకత ఉందన్న సీజేఐ.. బార్ అసోసియేషన్‌లో అనేక విషయాలు చర్చించుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. బెజవాడ గాలి పీల్చి, కృష్ణా నది నీళ్లు తాగే ఈ స్థాయికి చేరానని సీజేఐ వ్యాఖ్యానించారు. రెండ్రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగానని.. సొంత రాష్ట్రంలో దక్కిన ఆదరణ తన మనసును కదిలించిందని పేర్కొన్నారు.

"ఈ సమాజం మేధావులు, న్యాయవాదుల వైపు చూస్తోంది. దేశమంటే మట్టికాదోయ్‌ అనే దానికి తార్కాణం.. బెజవాడ బార్ అసోసియేషన్. ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా మొదట స్పందించేది.. బెజవాడ బార్ అసోసియేషన్. అప్పుడున్న చైతన్య స్ఫూర్తి ఇప్పుడు కాస్త తగ్గిందని భావిస్తున్నా. ప్రభుత్వంతో మాట్లాడి బార్‌ అసోసియేషన్ భవనానికి మరమ్మతు చేయించాం. 11 ఏళ్లయినా విజయవాడలో భవనం నిర్మించుకోలేకపోయాం. రెండు, మూడు నెలల్లో బార్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభిస్తా" - సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ

న్యాయవ్యవస్థ పట్ల చిన్నచూపు ఉంది..
న్యాయవ్యవస్థ పట్ల కార్యనిర్వాహక వ్యవస్థకు చిన్నచూపు ఉందని సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ వ్యాఖ్యానించారు. ఇవాళ బలహీనుడు కోర్టుకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ రావాలని అభిప్రాయపడ్డారు. మాతృభాషలోనే న్యాయవ్యవస్థ కార్యకలాపాలు జరగాలన్నారు. మాతృభాషలో కార్యకలాపాలు జరగకపోతే వ్యవస్థపై నమ్మకం ఉండదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంటేనే మనకు గౌరవం పెరుగుతుందన్నారు.

"న్యాయవ్యవస్థను ఎవరూ కించపరచకూడదు. జడ్జిలపై జరిగిన దాడులను అందరూ ప్రశ్నించాలి. డబ్బు లేక న్యాయం దక్కలేదనే మాట ఎవరినుంచీ రాకూడదు. న్యాయవ్యవస్థ గౌరవం కాపాడే బాధ్యత.. న్యాయవాదులదే. సమాజంలో ఉన్న గౌరవాన్ని న్యాయవాదులు కాపాడుకోవాలి. ఉచిత న్యాయసేవలు అందించేందుకు కొంత సమయం కేటాయించాలి. కోర్టుల్లో మౌలిక వసతులు పెంచాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు దేశంలోని అనేక బార్‌ అసోసియేషన్లు నా తరఫున నిలబడ్డాయి" - సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ

సీజేఐ చాలా మార్పులు తెచ్చారు - జస్టిస్ లావు నాగేశ్వరరావు
justice lavu nageshwara rao: న్యాయవ్యవస్థలో సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ చాలా మార్పులు తెచ్చారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అన్నారు. ఒకేసారి 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించారని గుర్తు చేశారు. హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జిల భర్తీపై దృష్టి సారించారన్న ఆయన.. ఒకేసారి వందమంది హైకోర్టు జడ్జిల పేర్లు ప్రతిపాదించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో కోర్టుల్లో ఉన్న అన్ని ఖాళీలనూ భర్తీ చేయాలని సీజేఐ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 3 రోజులుగా జస్టిస్ ఎన్‌.వి.రమణ చాలా బిజీగా ఉన్నారన్న జస్టిస్‌ నాగేశ్వరరావు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా సీజేఐలో అలసట లేదన్నారు. తెలుగువారి అభిమానం చూసి కష్టాలన్నీ మరిచిపోతున్నారని వ్యాఖ్యానించారు.

"మన దగ్గరకు వచ్చిన కక్షిదారుకు న్యాయం చేయాలి. నిత్యం చదివితేనే న్యాయవాదులు రాణిస్తారు. కోర్టుల్లో వసతులు లేక కక్షిదారులకు అనేక ఇబ్బందులు. సీజేఐ పదవికి మరింత వన్నె తేవాలని కోరుకుంటున్నా" - జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

జస్టిస్ ఎన్​.వి రమణ మంచిపేరు తెచ్చుకున్నారు - జస్టిస్ నర్సింహా
Justice Narasimha: ఏపీ పర్యటనకు రావాలని సీజేఐ.. తనను ఆప్యాయంగా ఆహ్వానించారని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ నర్సింహా తెలిపారు. సుప్రీంకోర్టుకు ఒకేసారి 9 మంది జడ్జిలను నియమించారని చెప్పారు. జస్టిస్ రమణ న్యాయవ్యవస్థలో మంచిపేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.

"జస్టిస్ రమణ న్యాయవ్యవస్థలో మంచిపేరు తెచ్చుకున్నారు. న్యాయవాదులు వాదనలకే పరిమితం అని అనుకునేవాడిని. తీర్పుల్లో భాగస్వామి అయ్యాక నా అభిప్రాయం మార్చుకున్నా. న్యాయవాదులు ధర్మంగా ప్రాక్టీస్ చేయాలి" - జస్టిస్ నర్సింహా

ఇదీ చదవండి:

CJI Justice NV Ramana: 'మాట ఇస్తున్నా... న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపచేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.