సాహసం సేయరా పర్యాటకా!.. ఆకర్షిస్తున్న అడ్వెంచర్​ టూరిజం

author img

By

Published : Aug 7, 2022, 4:21 AM IST

సాహసం సేయరా పర్యాటకా

రాష్ట్రంలో అడ్వెంచర్​ టూరిజంకు డిమాండ్​ పెరుగతోంది. జలపాతాలు, జలాశయాల్లో ఏర్పాటు చేసిన సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఈ అడ్వెంచర్​ టూరిజం ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది? వసతి, భోజనం తదితర సదుపాయాల పరిస్థితి ఏమిటి? మొదలైన వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్రంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. జలాశయాలు, జలపాతాల అందాల్ని పర్యాటకులు వీక్షిస్తూ సరికొత్త అనుభూతుల్ని పొందుతున్నారు. కొండలు, గుట్టలు ఎక్కడమే కాదు.. వందల అడుగుల ఎత్తుల్లోంచి జలపాతంతో పోటీపడుతూ కిందకు జారుతున్నారు. భారీ జలాశయాల్లో విన్యాసాలు చేస్తున్నారు. పడవలో పయనిస్తూ ముందుకు సాగుతున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో యువకులు, పిల్లలు, పెద్దలతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. లక్నవరం చెరువు, కుంటాల, గాయత్రి, బాబేజారి, మిట్టె, ముత్యంధార జలపాతాలు, పాండవులగుట్ట సాహస కృత్యాలకు నెలవులుగా మారుతూ.. యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. వసతి, భోజనం తదితర సదుపాయాల పరిస్థితి ఏమిటి? తదితరాలపై పూర్తి కథనం.

.

విదేశాల్లో, దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకే పరిమితమైన అడ్వెంచర్‌ టూరిజం రాష్ట్రంలోనూ పెరుగుతోంది. వివిధ సౌకర్యాలు, క్రీడలకు ఏర్పాట్లు కల్పించడంతో లక్నవరం చెరువు, కుంటాల, గాయత్రి, బాబేజారి, మిట్టె, ముత్యంధార జలపాతాలు, పాండవులగుట్టకు కొంతకాలంగా అడ్వెంచర్‌ టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వసతి, భోజనం తదితర సదుపాయాలు మెరుగుపరిస్తే పర్యాటకం మరింత ఊపందుకునే అవకాశం ఉంటుంది.

.

జలపాత హోరు.. పర్యాటక ఊపు..
కొండలపై నుంచి దూకుతున్న జలధారల్లో తడుస్తూ తాడు సాయంతో కిందికి చేరడమే వాటర్‌ఫాల్‌ రాప్లింగ్‌. విదేశాల్లో అడ్వెంచర్‌ టూరిజంలో సాహసాలు చేసేవారికి స్థానికంగా అడ్వెంచర్‌ సంస్థలు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామ సమీపంలో 330 అడుగుల ఎత్తయిన గాయత్రి జలపాతంలో వాటర్‌ రాప్లింగ్‌ పోటీలు జరగబోతున్నాయి. వేగంగా కిందికి దిగేవారు ఇందులో విజేతలు.

.

700 అడుగుల ఎత్తులోంచి..
ములుగు జిల్లా ముత్యంధార.. 700 అడుగుల ఎత్తులోంచి జలధారలు పడుతూ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. కొంతకాలంగా ఈ జలపాతానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడా వాటర్‌ఫాల్‌ రాప్లింగ్‌ నిర్వహణకు ప్రయత్నాలు జరిగాయి.

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రావులపల్లి శివారులోని పాండవుల గుట్ట.. పచ్చని పొలాల మధ్య ఎత్తయిన గుట్టలు రాక్‌ క్లైంబింగ్‌తో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. గుట్టలకు ముందు చన్నికుంట ఉండటంతో అక్కడ గుడారాలు వేసి నైట్‌ క్యాంపింగ్‌ కూడా నిర్వహిస్తూ రాత్రి బస సదుపాయం కల్పించారు. అతి పురాతన రాతి చిత్రాలు ఇక్కడ మరో ఆకర్షణ.

లక్నవరం.. 15-20 రోజుల ముందు బుకింగ్‌
లక్నవరం చెరువుకు పర్యాటకుల తాకిడి బాగా ఉంది. ఇక్కడి కాటేజీలు 15, 20 రోజుల ముందే బుక్‌ అవుతున్నాయి. మనిషి ఓ పెద్ద బంతిలోకి వెళ్లి అందులో నడుస్తుంటే చెరువులో అది ముందుకు వెళ్లడం.. కట్ట నుంచి చెరువు మీదుగా ద్వీపం వరకు తాడు వేసి, దానిపై గాలిలో సైకిల్‌ తొక్కడం.. పడవలో కూర్చుని తెడ్డు ఊపుతూ ముందుకు సాగడం వంటి జలసాహస క్రీడలతో లక్నవరం ఆకర్షిస్తోంది. ఇప్పటికే లక్నవరం చెరువుపై జిప్‌లైన్‌ సైకిల్‌ ఉండగా, జిప్‌ సైకిల్‌ తీసుకురాబోతున్నారు.

.
కె.రంగారావు

"సాహసాలకు ఉవ్విళ్లూరే యువతను ప్రోత్సహిస్తున్నాం. ఆదిలాబాద్‌ జిల్లాలోని గాయత్రి జలపాతంలో సెప్టెంబరు 30-అక్టోబరు 4 వరకు వాటర్‌ఫాల్‌ రాప్లింగ్‌ ప్రపంచకప్‌ పోటీలను నిర్వహించబోతున్నాం. 300-500 అడుగుల ఎత్తున్న కొండలపై నుంచి నీళ్లతో పాటు జారుతుంటే ఆ అనుభూతే వేరు."
- కె.రంగారావు, వాటర్‌ఫాల్‌ రాప్లింగ్‌ వరల్డ్‌కప్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ వ్యవస్థాపకుడు

శ్రీనివాస్​ గుప్తా

"రాష్ట్రంలో అడ్వెంచర్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. అనేక జలపాతాలు, జలాశయాలున్నాయి. సీఎం, పర్యాటక మంత్రితో చర్చించి సాహసంతో కూడిన సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాం."
- ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఛైర్మన్‌ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ

ఇదీ చూడండి : Governor Tamilisai : 'సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.