పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?
సాధారణంగా మనం ఎవరి మీదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీసులను ఆశ్రయిస్తాం. మన గోడు వెల్లబోసుకుంటాం. మరి మూగజీవాలు ఎవరి మీదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఏం చేస్తాయి. అవి కూడా పోలీసుల వద్దకే వెళ్తాయా. మిగతా జీవాల సంగతేమో కానీ.. ఓ శునకం మాత్రం తన బాధను చెప్పుకోవడానికో లేక ఎవరిమీదైనా ఫిర్యాదు చేయడానికో పోలీసులను ఆశ్రయించింది. ఈ వింత సంఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది.
తన మొర ఆలకించమంటూ ఓ శునకం.. పోలీసుల ముందు నిలబడింది. తనను కాలనీ నుంచి వెళ్లగొట్టారనో లేక తిండి పెట్టడం లేదనో ఫిర్యాదు ఇద్దామనుకున్నట్లుంది. ఇలా ఎస్సై ముందు తన గోడు వెల్లబోసుకోవడానికి వచ్చింది.
హైదరాబాద్ కూకట్పల్లిలోని పలు కాలనీల్లో ఇటీవల శునకాలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రజలు భయంతో వాటిని రాళ్లతో కొడుతున్నారు. అలా వారి బారి నుంచి తప్పించుకుందో ఏమో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఎస్సై ముందు ప్రత్యక్షమైంది ఓ శునకం. ఆ అధికారికి తన బాధను విన్నవించడానికి ప్రయత్నించింది. శునకం బాధ అర్థం కాకపోయినా.. దానికి తిండి పెట్టాలని సిబ్బందిని ఎస్సై ఆదేశించారు. కడుపు నిండగానే ఆ శునకం స్టేషన్ నుంచి వెళ్లిపోయింది.
- ఇదీ చదవండి : Nandi Medaram: నంది మేడారం నుంచి జలాల ఎత్తిపోత
