ఒకప్పుడు రోజుకు రూ. 80 కూలీ పని.. ఇప్పుడు ఒక షాప్‌కు ఓనర్​

author img

By

Published : Sep 10, 2022, 5:42 AM IST

young carpenter sandeep

Young Carpenter in Adilabad: జీవితమంటే నిత్యం పోరాటమే. ఆ పోరాటానికి ఎదురు తిరిగి నిలబడితేనే కదా అసలైన విజయం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రాదు. ఉన్న టాలెంట్‌ను సరిగ్గా వినియోగిస్తే అంతకంటే ఎక్కువ అద్భుతాలు సృష్టించవచ్చు. అదెలా అంటారా.. ఆలోచనే నీ పెట్టుబడి అవుతుంది. నీ విజయానికి తొలి మెట్టు అవుతుంది. ఇవే మాటలను నిజం చేసి చూపిస్తున్నాడు ఆదిలాబాద్‌కు చెందిన ఓ యువకుడు.

ఒకప్పుడు రోజుకు రూ. 80 కూలీ పని.. ఇప్పుడు ఒక షాప్‌కు ఓనర్​

Young Carpenter in Adilabad: అందరీలానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఈ యువకుడు. కానీ విఫలమయ్యాడు. అలా అని కుంగిపోలేదు. ఏం పని చేస్తే నేను కుటుంబాన్ని చూసుకోగలుగుతా అని ఆలోచించాడు. దానికి అనుగుణంగా కార్యాచరణ చేసుకుని పట్టుదలతో ప్రయత్నించాడు.. విజయం సాధించాడు. అతడే సందీప్‌. ఆదిలాబాద్‌జిల్లా తాంసి మండలంలో పొన్నారి గ్రామం సందీప్‌స్వస్థలం. వ్యవసాయమే ఆధారమైన ఈ గ్రామం బాహ్యప్రపంచానికి అంతగా పరిచయం లేదు. అలాంటి గ్రామానికి సందీప్‌ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతున్నాడు. కష్టపడే తత్వం ఉండాలే కానీ ఎక్కడైనా బతికేయ్యెుచ్చు అని నిరూపిస్తున్నాడు.

'నేను ఆర్మీ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాను. కానీ మొదటిసారి రన్నింగ్ పోయింది. రెండోసారి కచ్చితంగా కొడుతాననే నమ్మకం ఉంది. ఆర్మీలో ఉద్యోగం సాధించాలనేది నా కోరిక. ఒకవేళ రాకపోతే ఇదే వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తాను. మాది చాలా పేద కుటుంబం. అల్యూమినియంతో కూడిన వాల్‌సీలింగ్‌, తలుపులు, కిటికీలు, వంటగదిలో ఉపయోగపడే పరికరాలను తయారుచేయడం మొదలుపెట్టాను. చిన్నచిన్న వాటికీ హైదరాబాద్, మహరాష్ట్ర వెళ్లకుండా ఇక్కడ ఆ పని నేర్చుకుని చిన్న షాపు మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. నేను మొదట 80 రూపాయలకు నేర్చుకున్నాను. అందులో 20 రూపాయలు రవాణా ఖర్చులకే పోయేవి. వాటిని కూడబెట్టుకొని మొదట చిన్నచిన్న మెషిన్లు కొనుకొని చిన్న షాపు మొదలుపెట్టాను. మెల్లగా మెల్లగా పెద్ద షాపు పెట్టాను. నా కింద ఇద్దరు వర్కర్లు పనిచేస్తారు. చచ్చిపోతే ఏం వస్తది బతికి చూపెట్టాలనేదే నా కోరిక.'-సందీప్‌, పొన్నారి గ్రామం ఆదిలాబాద్‌

సందీప్‌కు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరిక. కానీ ఒకసారి వయసు అడ్డంకి కాగా మరోసారి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఐనా పట్టు విడవలేదు. చిన్న కుటుంబం కావడంతో ప్రభుత్వ ఉద్యోగమైతే స్థిరపడొచ్చని అనుకున్నాడు. కానీ అది విఫలమవడంతో పని చేయడం మెుదలు పెట్టాడు. ఆదిలాబాద్‌లో రోజుకు 80 రూపాయలకు కార్పెంటర్‌గా పనిలో చేరాడు. కార్పెంటర్‌గా పనికి కావాల్సిన మెలకువలు తెలుసుకుని గృహవసరాలకు వినియోగించే ఆధునిక పరికరాలను తయారు చేస్తున్నాడు. కొత్త కొత్త పద్ధతుల్లో అల్యూమినియంతో కూడిన వాల్‌సీలింగ్‌, తలుపులు, కిటికీలు, వంటగదిలో ఉపయోగపడే పరికరాలను తయారుచేయడం ప్రారంభించాడు.

'చిన్న గ్రామంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మట్టిలో మాణిక్యం ఇతను. మంచి టాలెట్ ఉంది సందీప్​కి. ఈ బాబు ఎన్నో కష్టాలు ఉన్నా ఆర్మీలో విఫలమైనా సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా చక్కగా పనిచేస్తాడు. చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నాగపూర్, నాందేడ్, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మిగతావారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు.'-వినోద్‌, రఘు స్థానికులు

తను రోజు సంపాదించిన 80 రూపాయలను జమచేసి పొన్నారిలోనే సొంతంగా దుకాణం తెరిచాడు సందీప్‌. నేర్చుకున్న పనిని మరో ఇద్దరికి నేర్పించి వారినే పనిలో పెట్టుకున్నాడు. మనోడి నైపుణ్యం చూసి హైదరాబాద్‌, మహారాష్ట్ర, నాగ్‌పూర్‌, నాందేడ్‌ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఆర్డర్‌లు ఇస్తుండటంతో పొన్నారి సుపరిచితమైంది. సందీప్‌నైపుణ్యాన్ని చూసిన వారంతా ఈ యువకుడికి అవకాశం ఇస్తున్నారు. ఈ షాపు చిన్న గ్రామంలోనే ఉన్నా పేరు మాత్రం చాలా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిందని అంటున్నారు స్థానికులు. సందీప్‌తో పాటు అతడి గ్రామంకు కూడా ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందుతోందని చెబుతున్నారు. ప్రతిరోజు 80 రూపాయల కూలీతో తినడానికే ఇబ్బందులు పడిన సందీప్‌ఇప్పుడు సొంత వాహనంపై తిరుగుతున్నాడు. తనే యజమాని అయ్యి ఇద్దరు యువకులకు జీతాలు ఇస్తున్నాడు. ఇష్టంతో చేస్తే ఎంతటి పనైనా చాలా సులభంగా ఉంటుంది... ఉదాహరణే సందీప్‌.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.