కృత్రిమ కాళ్ల సాయంతో సేద్యం... స్ఫూర్తిగా నిలుస్తున్న యువకుడు

author img

By

Published : May 12, 2022, 10:08 AM IST

Updated : May 13, 2022, 11:06 PM IST

Nikade Vishnumurthy

జీవితం చాలా పెద్దది. ఎవరికైనా కష్టాలు సహజం. కానీ ఆ యువకుడి కష్టాలు చెప్పుకోలేనివి. ప్రమాదవశాత్తు వరి నూర్పిడి యంత్రంలో పడి రెండు కాళ్లూ కోల్పోయినా... పట్టుదల, సంకల్ప బలంతో దాన్ని అధిగమిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కుమురం భీం జిల్లాకు చెందిన ఓ యువకుడు.

కృత్రిమ కాళ్ల సాయంతో సేద్యం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న విష్ణుమూర్తి

విధి కన్నెర్ర చేసినా పట్టుదల, సంకల్ప బలంతో దాన్ని అధిగమిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురం భీం జిల్లాకు చెందిన నికాడె విష్ణుమూర్తి(31) అనే యువకుడు. ప్రమాదవశాత్తు వరి నూర్పిడి యంత్రంలో పడి రెండుకాళ్లూ కోల్పోయి బతకడమే కష్టమనుకున్న పరిస్థితి నుంచి బయటపడటమే కాదు.. కృత్రిమ కాళ్లతో సొంతంగా వ్యవసాయ పనులు చేసుకోగలుగుతున్నారు. కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన విష్ణుమూర్తి డిగ్రీ వరకు చదివారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు.

నాలుగేళ్ల క్రితం పొలంలో ధాన్యం కుప్పలను నూర్పిడి యంత్రంలో వేసేక్రమంలో ప్రమాదవశాత్తు రెండు కాళ్లు క్రషర్‌ చక్రాల్లో పడ్డాయి. మోకాళ్ల వరకు చితికిపోయాయి. విషయం తెలిసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించి.. జర్మన్‌ టెక్నాలజీతో తయారైన కృత్రిమ కాళ్లను అమర్చేలా కృషిచేశారు. తన వంతు సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచీ అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితులు విష్ణుమూర్తిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేశాయి. కాళ్లు కోల్పోకముందు చేసిన పనులు ఇప్పుడూ చేయగలుగుతున్నారు. మొదట్లో ఆరు నెలల పాటు ఇబ్బందులు పడినప్పటికీ ఆ తరువాత అలవాటు పడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అరక పట్టడం మినహా అన్ని వ్యవసాయ పనులు చేస్తున్నారు. కృత్రిమ కాళ్ల సాయంతో ట్రాక్టర్‌ను కూడా నడుపుతున్నారు. ఆరు నెలల క్రితం వివాహం సైతం చేసుకున్నారు.

'నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితి బాగాలేక వ్యవసాయం చేస్తున్నాను. ట్రాక్టర్ కొని దాని ద్వారా మరింత జీవనోపాధి పొందుతున్నాను. ఆరు సంవత్సరాల క్రితం వరి నూర్పిడి యంత్రంలో పడి నా రెండు కాళ్లు పోవడం జరిగింది. దాంతో 6 నెలల దాకా బాగా కుంగి పోయాను. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో రెండు కాళ్లు పెట్టించుకున్నాను. సంవత్సరం వరకు ఎలాంటి పని చేయలేకపోయాను. ఆ తర్వాత నా పనులు నేనే చేసుకుంటున్నాను. సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాను. ఇంట్లో వాళ్లు కూడా ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుంది.' -నికాడె విష్ణుమూర్తి, యువరైతు

'నికాడే విష్ణుమూర్తి వరి నూర్పిడి యంత్రంలో పడి ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయాడు. కృత్రిమ కాళ్లు పెట్టుకుని వ్యవసాయ పనులు, ట్రాక్టర్ నడుపుతూ మామూలు వ్యక్తిలా అన్ని పనులు చేస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మంది ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి ధైర్యం కోల్పోయి అక్కడే ఉంటారు. విష్ణమూర్తి అలా కాకుండా ధైర్యంతో కృత్రిమ కాళ్లతో ముందుకు వెళుతున్నాడు.' -బ్రహ్మయ్య, సర్పంచ్

'మా బావ వరి నూర్పిడి యంత్రం పడుతుండగా ప్రమాదవశాత్తు కాళ్లు అందులో పడి మోకాళ్ల వరకు కోల్పోయాడు. కృత్రిమ కాళ్లు పెట్టుకున్న రెండు సంవత్సరాల వరకు ఇబ్బంది పడినా ఆ తర్వాత మా లాగానే అన్ని పనులు చేస్తున్నాడు. ట్రాక్టర్, బండి నడుపుతున్నాడు. చాలా మంది ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి బాధపడుతున్నారు. కానీ మా బావ ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.' -శ్రీకాంత్, బంధువు

ఇదీ చదవండి:అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​.. ఓకే చేశారా.. ఇక అంతే.!

Last Updated :May 13, 2022, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.