షావోమీకి బిగ్ షాక్.. రూ.5551కోట్ల డిపాజిట్లు జప్తునకు లైన్ క్లియర్

author img

By

Published : Sep 30, 2022, 6:26 PM IST

Updated : Sep 30, 2022, 6:31 PM IST

xiaomi ed case

ప్రముఖ మొబైల్​ ఫోన్​ తయారీ సంస్థ షావోమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్​ చేసేందుకు ఫెమా కంపీటెంట్ అథారిటీ అంగీకారం తెలిపింది. షావోమీ సహా విదేశాల్లోని మూడు కంపెనీలకు ఆ సంస్థ భారత విభాగం రాయల్టీ ముసుగులో ఈ డబ్బును చెల్లించినట్లు నిర్ధరిస్తూ కొంతకాలం క్రితం ఈ డిపాజిట్ల జప్తునకు ఈడీ చర్యలు ప్రారంభించింది.

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షావోమీకి భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. ఫెమా(విదేశీ మారక చట్టం) నిబంధనల ఉల్లంఘనల కింద షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.5551.27కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు జప్తు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఫెమా కంపీటెంట్ అథారిటీ శుక్రవారం ఈ మేరకు ఆమోదముద్ర వేసింది.

చైనాకు చెందిన షావోమీ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన షావోమీ ఇండియా భారత్‌లో 2014 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే ఈ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆ సంస్థకు చెందిన డిపాజిట్లు జప్తు చేసేందుకు ఏప్రిల్ 29న ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.

''ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షావోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేగాక, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసింది.'' అని ఈడీ నాటి ప్రకటనలో వెల్లడించింది.

డిపాజిట్ల జప్తు ప్రతిపాదనలకు ఫెమా కంపీటెంట్ అథారిటీ అంగీకారం తప్పనిసరి. సంబంధిత దస్త్రాల్ని ఈడీ కొన్ని నెలల క్రితం కంపీటెంట్ అథారిటీకి సమర్పించగా.. ఎట్టకేలకు శుక్రవారం ఆమోదం లభించింది. రూ.5551.27 కోట్ల డిపాజిట్ల జప్తునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత దేశ చరిత్రలో జప్తు చేసిన అత్యధిక మొత్తం ఇదే.

Last Updated :Sep 30, 2022, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.