స్టాక్‌ మార్కెట్‌..తగ్గినా.. మంచిదే..! అదెలానో తెలుసుకోండి మరీ..

author img

By

Published : Jun 17, 2022, 4:45 AM IST

simple stock market strategy

Stock Market: స్టాక్‌ మార్కెట్‌.. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు ఉన్న మార్గాల్లో ఇదొకటి. సూచీలు జీవన కాల గరిష్ఠాల నుంచి పడుతూ వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరవుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. హెచ్చుతగ్గులు మార్కెట్లో సహజం. స్వల్పకాలంలో నష్టభయం ఉంటుంది. దీన్ని తట్టుకున్నప్పుడే భవిష్యత్‌ లాభాలను కళ్లచూడగలం. సూచీలు తగ్గుతున్న నేపథ్యంలో మదుపరులు ఏం చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Stock Market: మంచి షేర్లు అందుబాటు ధరలోకి వచ్చినప్పుడు మదుపు చేయాలి.. మంచి ధర పలికినప్పుడు అమ్ముకోవాలి. స్టాక్‌ మార్కెట్లో లాభాలను ఆర్జించేందుకు ప్రధాన సూత్రం ఇదే. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్లు, ఇంటి నుంచి పని తదితర కారణాలతో చాలామంది స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అనవసర ఖర్చులు తగ్గడం, మిగులు మొత్తాలు పెరగడమూ ఒక కారణంగా చెప్పొచ్చు. మార్కెట్‌ పతనం నుంచి కోలుకోవడంతోపాటు, జీవన కాల గరిష్ఠాన్ని నమోదు చేయడంతో.. చాలామంది లాభాలనూ మూటగట్టుకున్నారు. కానీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఇలా ఎన్నో కారణాలు ప్రస్తుతం మార్కెట్లో దిద్దుబాటుకు కారణం అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మదుపరులు ఆందోళన చెందకుండా స్థిరంగా ఉండాలి. స్వల్పకాలిక దృష్టితో కాకుండా.. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. భావోద్వేగాలతో కాకుండా... విశ్లేషణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. బేర్‌ మార్కెట్‌ తరువాత బుల్‌ మార్కెట్‌ కచ్చితంగా ఉంటుందని మనం చరిత్రను చూసి గమనించవచ్చు.

దీర్ఘకాలమే రక్ష...: బేర్‌ మార్కెట్‌ మదుపరులలో అనేక అనుమానాల్ని రేకెత్తిస్తుంది. పెట్టుబడిని కోల్పోతామనే భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో షేర్లను వచ్చిన ధరకు విక్రయించేందుకు సిద్ధపడటం ఏమాత్రం సమాధానం కాదు. ‘ఇతరులు భయ పడుతున్నప్పుడు.. మనం పెట్టుబడి పెట్టేందుకు ముందుండాలి.. ఇతరులు మదుపు చేసేందుకు అమితాసక్తితో ఉన్నప్పుడు మనం భయపడాలి’ ఇది స్టాక్‌ మార్కెట్‌లో ప్రాథమిక సూత్రం. చాలామంది మదుపరులు షేర్ల ధర తగ్గుతున్నప్పుడు వాటిని అమ్మేసి, ‘హమ్మయ్య... నష్టం రాలేదు’ అని భావిస్తుంటారు. మంచి షేర్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాలి. బేర్‌ మార్కెట్లో అనేక షేర్లలో మంచి అవకాశాలుంటాయని గుర్తుంచుకోవాలి. అనేక పెద్ద కంపెనీల వాటాలు మార్కెట్‌ భయాందోళనల నేపథ్యంలో గరిష్ఠాల నుంచి 52 వారాల కనిష్ఠాలకు వచ్చే ఆస్కారం ఉంటుంది. వీటిలో దశల వారీగా మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. మార్కెట్‌లో పరిస్థితులు మెరుగైనప్పుడు ఇవి మళ్లీ వేగంగా కోలుకునే వీలుంది.

వైవిధ్యంగా ఉండాలి..: మార్కెట్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనేది చూడకుండా.. అన్ని దశల్లోనూ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడమే ఎప్పుడూ మేలు. అన్ని కంపెనీల షేర్లూ ఒకే విధంగా పడిపోవు. మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడూ కొన్ని షేర్లు లాభాలు పంచుతాయి. కొన్నిసార్లు దీనికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అప్పులు ఎక్కువగా ఉండి, చిన్న చిన్న కారణాలతో ధర పడిపోయే షేర్లకు దూరంగా ఉండాలి. ఇలాంటివి మీ జాబితాలో ఉంటే.. వాటిని వెంటనే వదిలించుకోండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. సాంకేతికంగా ఉన్నతంగా ఉండి, బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్న సంస్థలను పరిశీలించాలి. ఒకే కంపెనీలో మదుపు చేయకుండా.. ఇండెక్స్‌ ఫండ్‌, ఈటీఎఫ్‌లనూ ఇలాంటి సమయంలో ఎంచుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాలకు పెట్టుబడులను అనుసంధానించాలి. నష్టభయం భరించే సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించే వ్యవధి ఆధారంగా షేర్లు, బాండ్లు, స్థిరాస్తి ఇలా పలు మార్గాల్లో మదుపు కొనసాగించాలి.

‘సిప్‌’ మార్గంలో..: నెలనెలా క్రమం తప్పకుండా మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) తోడ్పడుతుంది. కొన్ని మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయడానికి ప్రయత్నించాలి. వీటి ద్వారా షేర్లు, బాండ్లు, కమోడిటీలు ఇలా పలు విభిన్న పెట్టుబడి పథకాల్లో మదుపు చేసేందుకు వీలవుతుంది. మార్కెట్‌ దశలతో సంబంధం లేకుండా.. మంచి కంపెనీల షేర్లలో మదుపు చేసేందుకు మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. తక్కువ డబ్బుతోనూ వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనం పొందేందుకు ఇది తోడ్పడుతుంది. లాభాలు సంపాదించాలంటే.. దీర్ఘకాలం సిప్‌ను కొనసాగించాలి. అప్పుడే చక్రవడ్డీ ప్రయోజనం సిద్ధిస్తుంది.

రక్షణాత్మకంగా..: స్టాక్‌ మార్కెట్‌ గమనం ఎటువైపు ఉన్నా.. కొన్ని షేర్లు స్థిరంగా పనితీరును చూపిస్తుంటాయి. ఒక రకంగా వీటిని రక్షణాత్మక షేర్లుగా పరిగణించవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించండి. సాధారణంగా ఆహార, వ్యక్తిగత సంరక్షణ, ఫార్మా, హెల్త్‌కేర్‌, వినియోగవస్తువులు తదితర రంగాల షేర్లు బేర్‌ మార్కెట్‌, బుల్‌ మార్కెట్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంటాయి. వీటిల్లో మంచి కంపెనీలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి.
బేర్‌ మార్కెట్‌ కాస్త భయం కలిగించే మాట నిజమే. కానీ, పెట్టుబడులతో లాభాలు సంపాదించాలంటే..భయాందోళనలను అదుపు చేసుకోవాలి. వ్యూహం ఎంచుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం.. మార్కెట్లో విజయం సాధించే రహస్యం ఇదే.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.