రూపాయి మరింత పతనం.. వాటి ధరలకు రెక్కలు.. ఇక కష్టమే!

author img

By

Published : Sep 23, 2022, 10:44 AM IST

rupee falls to record low

Rupee falls to record low : రూపాయి విలువ మరింత దిగజారింది. చరిత్రలో అత్యల్పంగా శుక్రవారం 81 మార్కును తాకింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో అమెరికా డాలరు రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి బలపడడమే ఇందుకు కారణం.

Rupee falls to record low : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం రూపాయి విలువ మరింత దిగజారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలరుతో పోల్చితే 44 పైసలు తగ్గి.. 81.09కు క్షీణించింది. గురువారం రూపాయి విలువ ఏకంగా 83 పైసలు పతనమై.. డాలరుతో పోల్చితే 80.79కి చేరింది. ఫిబ్రవరి 24 తర్వాత రూపాయి ఒక్కరోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి.

రూపాయి పతనానికి కారణాలు
Rupee falling reasons : ఉక్రెయిన్​లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలో.. సురక్షిత పెట్టుబడుల వైపే మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. డాలరుపై పెట్టుబడులే భద్రమని వారు భావిస్తున్నారు. ఫలితంగా అమెరికన్ కరెన్సీ క్రమంగా బలపడుతోంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మున్ముందు కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ పరిణామాల మధ్య మదుపర్లు లాభాలు బాగుంటాయనే ఆశతో అమెరికా మార్కెట్ల వైపు మొగ్గుచూపుతుండగా.. ఆ దేశ కరెన్సీ పుంజుకుంటోంది. రూపాయి ఒత్తిడికి గురవుతోంది.

రెండేళ్ల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు
భారత్ దగ్గరున్న విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి క్షీణించాయి. ఈ ఏడాది ఆరంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక విదేశీ మారక నిల్వలు ఏకంగా 80 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. సాధారణంగా రూపాయి పతనాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుంటుంది. డాలర్ల విక్రయం ద్వారా రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే.. విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆర్​బీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రూపాయి క్షీణత వల్ల లాభనష్టాలు
Rupee fall effects : రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంటనూనె, పప్పుదినుసులకూ అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, సరఫరా చేసిన దేశానికి వాటిల్లోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే డాలర్ల కోసం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. ముడి సరకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ విలువ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై కూడా భారం పెరుగుతుంది.

తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు కరెన్సీ విలువ క్షీణత వల్ల లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. డాలరుకు ఎక్కువ రూపాయలు అందుతాయి కాబట్టి రూపాయి క్షీణత వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలు లాభపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.