తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

author img

By

Published : Sep 22, 2022, 8:09 AM IST

IIFL Wealth Hurun Rich List

Richest Persons In Telugu States :తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ తేల్చింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి కె.దివి అగ్రస్థానంలో ఉన్నారు.

Richest Persons In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు 'ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా సంపన్నుల జాబితా- 2022' వెల్లడించింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాదితో పోల్చితే వీరి ఆస్తి విలువ 3 శాతం పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

ఆహార ప్రాసెసింగ్‌, నిర్మాణ రంగాల వారూ ఉన్నారు. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్‌ లేబొరేటరీస్‌ అధిపతి మురళి కె.దివి, ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారధి రెడ్డి, ఆయన కుటుంబం రూ.39,200 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.8,700 కోట్ల విలువైన ఆస్తులతో మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల్లో 64 మంది (82%) హైదరాబాద్‌కు చెందిన వారే.
విశాఖపట్నం నుంచి అయిదుగురు, రంగారెడ్డి నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి ఏపీ, తెలంగాణల నుంచి కొత్తగా 11 మంది జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

.

దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే ముందు: దక్షిణ భారతదేశంలో అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయని, తత్ఫలితంగా సంపన్నుల సంఖ్య ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా పేర్కొంది. పదకొండు సంవత్సరాల క్రితం ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురే ఉండగా, ఇప్పుడు 78 కి పెరగడమే దీనికి నిదర్శనమని వివరించింది.

.
.

రోజుకు రూ.1612 కోట్ల సంపాదన..
అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 2021లో రోజుకు సగటున రూ.1612 కోట్ల చొప్పున సంపాదించారు. ఫలితంగా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022లో దేశీయంగా అగ్రస్థానాన్ని; ప్రపంచంలో రెండో స్థానాన్ని పొందారు. ఈ జాబితా ప్రకారం.. గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సంపద రూ.10.94 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాది కాలంలో ఆయన సంపద 116% (రూ.5.89 లక్షల కోట్లు) వృద్ధి చెందింది. అయిదేళ్లలో ఆయన సంపద 1440% రాణించింది. రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్‌ విలువ ఉన్న 7 కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడు అదానీయే. రెండో స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ సంపద రూ.7.95 లక్షల కోట్లుగా నమోదైంది. కనీసం రూ.1,000 కోట్ల సంపద ఉన్న దేశీయులు ఈ జాబితాలో 1103 మంది ఉన్నారు. గత అయిదేళ్లలో వీరి సంఖ్య 62% పెరిగింది.

జాబితాలో అతిపిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (రూ.1,000 కోట్లు) నిలిచారు. స్వయంకృషితో ఎదిగిన అతిపిన్న వయస్కురాలిగా కాన్‌ఫ్లుయెంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహా నర్ఖెడె నిలిచారు. నీ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లున్నా మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉందనేందుకు వీరి సంపద పెరగడమే నిదర్శనమని హురున్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనాస్‌ రహ్మాన్‌ జునైడ్‌ పేర్కొన్నారు. తాము రూపొందించిన సంపన్నుల జాబితాలోని మొదటి 149 మంది సంపద రూ.100 లక్షల కోట్లను మించిపోయిందని చెప్పారు.

.

ఇవీ చదవండి: రూ.20వేల కోట్ల బ్యాంకు స్కామ్​.. ఏబీజీ షిప్​యార్డు వ్యవస్థాపక ఛైర్మన్​ అరెస్ట్​

డిజిటల్​ చెల్లింపులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి : ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.