భారత్​ నుంచి విదేశీ స్టాక్స్​లో మదుపు చేయొచ్చా? లాభాలేంటి?

author img

By

Published : Sep 23, 2022, 4:42 PM IST

invest in international stocks from india

Invest in international stocks from India : భారతీయ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో వచ్చాయని వింటూనే ఉంటాం. మరి, మనం ఇతర దేశాల్లోని స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు వీలుందా? అనే సందేహం విచాలామందికి వస్తుంటుంది. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే అంతర్జాతీయ పథకాలతో మనమూ ఎంతో సులువుగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇలా మదుపు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది తెలుసుకోడమూ ముఖ్యమే.

Invest in foreign stocks from India : దేశీయంగా ఉన్న స్టాక్‌ మార్కెట్‌కే పరిమితం కాకుండా. అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలనూ ఉపయోగించుకోవాలని ఆలోచించే మదుపరులకు ఇంటర్నేషనల్‌ ఫండ్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. తమ పోర్ట్‌ఫోలియోకు మరింత బలం చేకూర్చాలనుకునే మదుపరులు, కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకునే వారూ వీటిని పరిశీలించవచ్చు. తద్వారా దేశీయ మార్కెట్‌ పరిధిని దాటి మదుపు అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.

పెట్టుబడుల్లో వైవిధ్యం ఉన్నప్పుడే మంచి రాబడిని ఆర్జించగలం. అంతర్జాతీయ ఫండ్లను ఎంచుకోవడమూ ఇందులో భాగంగానే అనుకోవచ్చు. ఒకే పెట్టుబడి పథకం లేదా భౌగోళిక మార్కెట్లకు పరిమితం కాకుండా.. దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలనుకున్న వారు.. వీటిని ఎంచుకోవచ్చు. భారత దేశ ఆర్థిక వృద్ధి పట్ల ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. పెట్టుబడి మొత్తంలో కొంత శాతాన్ని విదేశీ మార్కెట్లలో మదుపు చేసే ఫండ్లకు మళ్లించడం ద్వారా అధిక రాబడులను ఆర్జించేందుకు ప్రయత్నించవచ్చు.

అన్ని దేశాల మార్కెట్లూ ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో అవగాహన ఉండాలి. స్థూల ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక, రాజకీయ గందరగోళాలపై ఆధారపడి మార్కెట్లు పనిచేస్తుంటాయి. కొన్ని దేశాల మార్కెట్లు ఆకర్షణీయంగా ఉంటే.. మరికొన్ని పతనం దిశగా సాగుతుంటాయి. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న మార్కెట్లలోనూ కొన్నిసార్లు దిద్దుబాటు తప్పదు. ఉదాహరణకు అమెరికా మార్కెట్లను చూస్తే.. గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 32 శాతం వరకు దిద్దుబాటు వచ్చింది. అదే సమయంలో భారతీయ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు అంతగా పతనమవ్వలేదు. ఇలాంటివి మనం గమనిస్తూ మదుపు వ్యూహాన్ని రచించుకోవాలి.

పెట్టుబడి ఎలా..
అంతర్జాతీయ ఫండ్లను దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలే అందిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్‌ సంస్థలూ ఇలాంటి పథకాలను తీసుకొచ్చాయి. మంచి పనితీరున్న సంస్థను ఎంచుకొని, మదుపు ప్రారంభించవచ్చు. ఏ మార్కెట్లలోని సూచీ ఫండ్లలో మదుపు చేస్తుందో ముందు తెలుసుకోవడం మర్చిపోవద్దు. నేరుగా ఆన్‌లైన్‌లో లేదా ఫండ్‌ సంస్థ శాఖకు వెళ్లి, సలహాదారుడి ద్వారా పెట్టుబడులు ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో పెట్టుబడులు పెట్టడం వల్ల సగటు ప్రయోజనం లభిస్తుంది. ఏక మొత్తంలోనూ మదుపు చేయొచ్చు. వీలైనంత వరకూ సిప్‌ చేయడమే ఉత్తమం.

భౌగోళిక ప్రయోజనం..
పెట్టుబడి పోర్ట్‌ఫోలియో వివిధ భౌగోళిక ప్రాంతాలకు విస్తరించేందుకు ఇంటర్నేషనల్‌ ఫండ్లు సహాయపడతాయి. పెట్టుబడిదారుడు ఒకే దేశంలో మదుపు చేయాల్సిన అవసరాన్ని ఇవి తప్పిస్తాయి. నష్టభయం తగ్గించుకునేందుకు ఈ అంతర్జాతీయ పెట్టుబడులు తోడ్పడతాయి. ఒకే మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు ఈ వైవిధ్యం ఉండదు. మెరుగైన పెట్టుబడుల నిర్వహణలో భాగంగా అంతర్జాతీయ మదుపు వ్యూహాన్ని పాటించవచ్చు.

విభిన్నంగా..
సంపద సృష్టించాలంటే.. వివిధ పథకాలకు మన పెట్టుబడులను మళ్లించాలి. ఒక దేశంలో ఉన్న పథకాల పనితీరు దాదాపుగా ఒకేలా ఉండొచ్చు. మీ పెట్టుబడులను ఇతర దేశాల ఆర్థిక ఆస్తులకు కేటాయించినప్పుడు లభించే రాబడి భిన్నంగా ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యమైన పథకాలు ఉండేలా చూసుకునేందుకు అంతర్జాతీయ ఫండ్లు తోడ్పడతాయి. ఇతర మార్కెట్లో ఉండే లాభాలను సొంతం చేసుకునే వీలునూ కల్పిస్తాయి.

కొత్త పద్ధతులు..
మన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే.. విదేశీ మార్కెట్లు అభివృద్ధి చెందినవిగా చెప్పొచ్చు. మన దేశంలో లేని, లేదా అంత ప్రముఖంగా కనిపించని పెట్టుబడి విధానాలు, వ్యాపార అవకాశాలు అక్కడ ఉంటాయి. వీటి ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకునేందుకు అంతర్జాతీయ ఫండ్లను ఎంచుకోవచ్చు. దేశీయ పెట్టుబడిదారులను అంతర్జాతీయ మదుపరులుగా ఇవి మారుస్తాయి. విదేశాల్లో ఉండే పెట్టుబడి ధోరణుల ప్రయోజనాలను పొందేందుకు వీటి ద్వారా ప్రయత్నించవచ్చు.

కరెన్సీ లాభం..
అమెరికా సూచీలను ట్రాకింగ్‌ చేసే అంతర్జాతీయ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా కరెన్సీ హెచ్చుతగ్గుల లాభం కలిసొస్తుంది. సాధారణంగా దేశీయ పెట్టుబడుల్లో రూపాయి విలువకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ, అమెరికాలో మదుపు చేసినప్పుడు మారకపు విలువ కీలకంగా మారుతుంది. అంతర్జాతీయ ఫండ్లలో మదుపు చేసినప్పుడు రూపాయి ధర క్షీణిస్తే రాబడి పెరుగుతుంది. ఉదాహరణకు డాలరుతో రూపాయి విలువ రూ.70 ఉన్నప్పుడు మదుపు చేసిన వారు.. ఇప్పుడు దాదాపు 14 శాతానికి పైగా రాబడిని అందుకున్నారని చెప్పొచ్చు. అమెరికా మార్కెట్ల పనితీరు అంత బాగా లేకున్నా.. కేవలం కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల ఈ లాభాలు సొంతం అయ్యాయి.
- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.